ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించింది బాబే

  • – నిందితులకు పదవులిచ్చి అక్కున చేర్చుకున్న బాబు
  • – విశాఖ అభివృద్ది వైయస్‌ఆర్‌ హయాంలోనే జరిగింది
  • – అలవోకగా, మెత్తని అబద్ధాలు చెప్పి తప్పించుకోలేరు
  • – ప్రత్యేక హోదా ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష 
  • – యువత భవిష్యత్తు కోసం పోరాడాల్సిందే 
  • – విలేకరుల సమావేశంలో పార్టీ పొలిటికల్‌ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్ః ప్రత్యేకహోదా కావాలని కోరుకునే ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తెచ్చేందుకే కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించామని వైయస్‌ఆర్‌సీపీ పొలిటికల్‌ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రమంతా ముక్తకంఠంతో ప్రత్యేక హోదా కావాలని నినదిస్తున్నా ప్రభుత్వం అధికారం అడ్డుపెట్టుకుని అణచివేయడం హక్కులను కాలరాయడమేనని అన్నారు. శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న ఏపీ ప్రతిపక్ష నేతను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడం చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే హక్కులను అణచివేయడం దారుణమన్నారు. పైగా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తుంటే విశాఖను తగలడెడుతన్నారంటూ విషప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రికి తగదని హితవు పలికారు. రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోరుకుంటుంటే మీరు మాత్రం మెత్తని మాటలతో జనం గొంతు కోయడానికి సిద్ధపడటం సిగ్గు చేటన్నారు. ప్రజలంతా వింటున్నారన్న కనీసం జ్ఞానం లేకుండా అలవోకగా బాబు అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి విజయవంతంగా సైకిలెక్కి తిరుగుతున్న మీకు ఇదేమంత కష్టం కాదని చమత్కరించారు. 

జల్లికట్టు స్ఫూర్తితోనే ఉద్యమం
తమిళనాడులో యువత రగిలించిన జల్లికట్టు స్ఫూర్తితోనే ఇక్కడా విశాఖ శాంతి ర్యాలీకి యువత పిలుపునిచ్చిందని సజ్జల అభిప్రాయపడ్డారు. గత రెండున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ కూడా ప్రత్యేక హోదా కోసమే పోరాడుతోందన్నారు. అందుకే ఇలాంటి ర్యాలీకి తాము మద్దతు ప్రకటించామని.. పోలీసుల బెదరింపులు.. అరెస్టులు.. అణచివేత నేపథ్యంలో యువతకు మనోధైర్యం కల్పించేందుకు మా అధినేత స్వయంగా శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. అయితే సీఎం సహా టీడీపీ నాయకులు విశాఖను తగలబెడుతున్నారని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోవడాన్ని చూపించి విశాఖను నాశనం చేస్తారని చెప్పడం వారి అసహనానికి నిదర్శనమన్నారు. విశాఖలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ రాజకీయాలకు అతీతంగా జరిగిందని.. ముఖ్యమంత్రి, పవన్‌ కళ్యాణ్‌తో అందర్నీ ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానించామని గుర్తు చేశారు. అందరూ కలిసి వస్తేనే హోదా సాధన తేలికవుతుందనేది వైయస్‌ జగన్‌ అభిప్రాయమని ఇప్పటికే పలు వేదికలపై అదే విషయాన్ని చెప్పారన్నారు. 

వైయస్‌ కుంటుంబం గురించి నీకేం తెలుసు
వైయస్‌ఆర్‌ కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేసి లబ్ధిపొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయం చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. అసలు వారి గురించి నీకేం తెలుసు.. పులివెందుల రౌడీలు, కడప గూండాలు అని ప్రచారం చేసుకుంటూ లబ్ధిపొందాలని మీరు చూస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్‌ రాజారెడ్డిని దారుణంగా చంపినప్పుడు కూడా వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి సంయమనం పాటించారని.. అభిమానులు, కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుందామని పోరు పెడుతున్నా ఆయన మాత్రం కడపలో శాంతి భద్రతలు వెల్లివిరియాలని కాంక్షించారన్నారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పక్కన చేర్చుకుని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిచ్చి హత్యారాజకీయాలను ప్రోత్సహించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ మరణంపై కూడా మాకు అనుమానాలున్నాయన్నారు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఎవరు అంతమవుతారో అని బాబు సవాల్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక ముఖ్యమంత్రిగా ఉండి గంట ప్రెస్‌ మీట్‌ పెట్టి మీరు చెప్పిన విషయాలు చూస్తే జనం నవ్వుతున్నారని తెలిపారు. వైజాగ్‌ను నాశనం చేశారని ప్రచారం చేస్తున్న మీరు... రెండు సార్లు వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. మొన్నటి వాల్తేరు క్లబ్‌లో పంచలు కట్టిన రౌడీలను దించి చేసిన రౌడీయిజం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.  దేశంలోనే ఏపీని అవినీతిలో నెంబర్‌వన్‌గా చేసిన ఘనత బాబుదేనని ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన ప్రెస్‌ మీట్‌ లో చంద్రబాబు మాట్లాడిన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం, కేంద్ర కార్యదర్శి ఇబ్బంది పడ్డారని ప్రచారం చేయడంపై సజ్జల మండిపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కర్ఫ్యూ వాతావరణం సృష్టించి జనాలను భయభ్రాంతులను గురిచేసింది మీరు..  శాంతియుత ర్యాలీకి వస్తున్న ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్‌పోర్టులో అడ్డుకుని రాజ్యాంగ హక్కులను కాలరాసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అంతమంది గురించి చెప్పే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఇద్దరు ఎంపీలను రన్‌వేపై అడ్డగించి మాట్లాడనీయకుండా వెనక్కి పంపడం సమంజసమా అని ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదా మన హక్కు...
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. అది భిక్షగా ఇచ్చేది కాదని సజ్జల స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధంగా మనకు దక్కాల్సిన హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితులు కల్పించింది మీరు.. పైగా న్యాయబద్దమైన హామీని నెరవేర్చాలని శాంతి ర్యాలీ చేయడానికి లేకుండా అడ్డుకున్నదీ మీరేనని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుందని ప్రచారం చేసుకుంటున్న మీతోపాటు మీ నాయకులందరికీ ప్రయోజనాలు తెలుసన్నారు. కాకపోతే కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవడానికి కేసులు అడ్డుపడి నోరు నొక్కేసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ముమ్మాటికీ ఏపీకి సంజీవనే అని అన్నారు. పక్క రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని మీరు అంటున్నారుగా ఎంత లాభం లేకపోతే వారు ఎందుకు అభ్యంతరం చెబుతారని ప్రశ్నించారు. 14 ఆర్థిక సంఘం పేరు చెప్పి జనాల్ని ఎంతకాలం మోసం చేస్తారని.. వారెప్పుడూ ప్రత్యేక హోదాకు అడ్డుచెప్పలేదని అభిజిత్‌ పటేల్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం సాధించామని చెప్పుకుంటున్న మీరు అది కొత్తగా ఇచ్చిందేమీ కాదన్నారు. విభజన చట్టంలోనే స్పష్టంగా పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని లిఖిత పూర్వకంగా పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. యూనివర్సిటీలు అన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వచ్చిన విధంగానే వస్తాయి తప్ప ప్రత్యేకత ఏమీ లేదన్నారు. కేంద్ర సాయం విషయానికొస్తే మీరు చెప్పే ‘మొత్తం’పై స్పష్టత లేదన్నారు. వెంకయ్య ఒక రకంగా, అరుణ్‌జైట్లీ ఒక మాట, చంద్రబాబు ఇంకోమాట చెబుతున్నారని వీటిల్లో ఏది నమ్మాలో అర్థంకావడం లేదన్నారు. దేశంలోనే భారీ తీరప్రాంతం, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉండి కూడా అభివృద్ధి చేయలేక చతికిలబడిపోయి ప్రతిపక్షం మీద పడి అసత్య ఆరోపణలు చేసుకుంటూ చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వలన ఉపయోగాలే లేకపోతే ఆనాడెందుకు నువ్వు వెంకయ్య ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని అడిగారు.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎందుకు చేర్చారని నిలదీశారు. 
Back to Top