రాష్ట్ర దుర్గతికి చంద్రబాబే ప్రథమ కారకుడు

ఎన్నికలొస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు.. హోదా వీరుడినంటూ డ్రామాలు
ప్రధానిని కలిసి ఇచ్చిన లేఖలను బాబు బయటపెట్టాలి
కాంట్రాక్ట్‌లపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర భవిష్యత్తుపై లేదా
రిలే నిరాహార దీక్షలను కార్యకర్తలు విజయవంతం చేయాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కానరాని రాష్ట్రంగా తయారవ్వడానికి ప్రథమ దోషి చంద్రబాబేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టించిన మోడీతో పాటు చంద్రబాబుపై కూడా ప్రజలు పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు.. ఆ వెంటనే ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమవ్వడం.. హోదాపై మా నాయకుడు వైయస్‌ జగన్‌కు ఉన్న నిబద్ధత స్పష్టం అవుతుందన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి అధికారమే పరమావధిగా భావించిన చంద్రబాబు ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నాలుగేళ్లుగా హోదాను పక్కనబెట్టి ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర మంత్రులును, ప్రధానిని సన్మానిస్తూ.. ప్రస్తుతం హోదా కోసం చేసే వీరుడిని నేనే అంటూ ప్రజలను మరోసారి వంచేందుకు కుట్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 
పోటుగాడిలా మాట్లాడితే.. సపోర్టు చేయాలా..?
29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధానిని ఏమేం కోరుతూ లేఖలు ఇచ్చారో వాటిని బయటపెట్టాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. జనవరి 12వ తేదీన ప్రధానిని కలిసి చంద్రబాబు ఇచ్చిన లేఖలో ఎక్కడ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్‌ ఫైనాన్స్, అసెంబ్లీ సీట్లు నొక్కి చెప్పారు కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్నే ప్రస్తావించలేదన్నారు. కాంట్రాక్టర్‌లను మార్చడం.. డబ్బులు కాజేయడంలో ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా, విభజన హామీలపై లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఓట్ల కోసం స్వార్థ రాజకీయాలు చేసే చంద్రబాబు ఇప్పుడేదో మోడీ మీద యుద్ధం అంటూ పోటుగాడిలా మాట్లాడితే.. ఎందుకు సపోర్టు చేయాలని విరుచుకుపడ్డారు. బీజేపీ, టీడీపీ కలిసి అడిగేవారు ఎవరూ లేరని హామీలను తుంగలో తొక్కారని ఫైరయ్యారు. 
రాజ్యాంగ వ్యతిరేక బుద్ధి నిరూపించుకున్న బాబు
ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని నుంచి చంద్రబాబు పారిపోయి అమరావతికి వచ్చాడని పార్థసారధి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి రాజ్యాంగ విరుద్ధంగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగ వ్యతిరేక బుద్ధిని నిరూపించుకున్నాడన్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాజీనామాలు చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చోబోతున్న వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలకు బాసటగా పార్టీ ప్రతీ కార్యకర్త బాసటగా నిలవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. 
Back to Top