బాధిత కుటుంబాలను ఓదార్చే బాధ్యత లేదా?

కర్నూలు: కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ పీఠాన్ని అందించింది మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. ముప్పై ఏళ్ళ పాటు ఆ పార్టీకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి వైయస్‌ అన్నారు. మన రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిందీ ఆయనే అని షర్మిల చెప్పారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం వైయస్‌ కన్న తండ్రిలా ఆలోచించి సుపరిపాలన అందించారని ఆమె అభివర్ణించారు. వైయస్‌ హయాంలో రాష్ట్ర ప్రజలు సువర్ణయుగాన్ని చవిచూశారని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో ఆయన చేసి చూపించారన్నారు. రాజన్న ఇచ్చిన ఎంపీల వల్లే కదా ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీకి అధికారం దక్కింది అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

'అలాంటి మహానేత ఆకస్మికంగా మరణిస్తే, ఆ బాధను తట్టుకోలేక కొన్ని వందల గుండెలు ఆగిపోతే.. ఒక్క కాంగ్రెస్ నాయకు‌డైనా పరామర్శించారా? ఒక్క కుటుంబాన్నయినా ఓదార్చారా? అలా మరణించిన వారంతా కాంగ్రెస్‌ పార్టీ వారే కదా? మరి వారి కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ నాయకులకు లేదా? అని షర్మిల నిలదీశారు. బాధిత కుటుంబాలను ఓదార్చుతామని గొప్పగా చెప్పారు. డబ్బు సాయం చేస్తామని చెప్పారు. చివరికి ఏదీ చేయకుండానే బాధిత కుటుంబాలను కాంగ్రెస్ వా‌ళ్ళు మరిచిపోయారు. మరణించిన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ వా‌రే అయినా పట్టించుకోలేదు’ అని షర్మిల కాంగ్రెస్‌ పార్టీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ఈ అసమర్థ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయకుండా పరోక్షంగా మద్దతిచ్చి కుమ్మక్కైన టిడిపి రాజకీయాలకు నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 30వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు.

మహానేతపై మచ్చ వేసేందుకు కుట్ర:
‘మహానేత వైయస్‌ ఏ పథకం పెట్టినా 'ఇందిర' అని, 'రాజీవ్‌' అని వాళ్ల పేర్లే పెట్టారు. అందుకు బహుమాతిగానే రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆ‌ర్‌లో చేర్చారు. ఇది అన్యాయం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆ‌ర్‌లో చేర్చి.. మీ గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్‌, టిడిపిలు ప్రయత్నిస్తున్నాయి. వైయస్‌ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారాన్ని అనుభవిస్తున్న ప్రస్తుత పాలకులు ఒక్క రాజన్న కుటుంబాన్నే కాకుండా, రాష్ట్ర ప్రజలందరి మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

మరో అవకాశం ఇవ్వమనడానికి సిగ్గులేదా?:
‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందలాది మంది చేనేత కార్మికులు, నాలుగు వేల మంది అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు మరణించిన వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును మహానేత వైయస్ అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. ‌వైయస్ అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చా‌రు. అదే చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను ఆయన శ్మశానాలుగా మార్చారు. అదే గ్రామాల మీదుగా ఇప్పుడు వెళుతూ సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటూ ఈ అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు’ అని షర్మిల మండిపడ్డారు.‌
Back to Top