బాబు పాదయాత్రపై ప్రజల్లో ఏవగింపు’

బెళుగుప్ప: ప్రజల విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబు పాదయాత్రను మండల ప్రజలు ఏవగించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ సీపీ మండల కన్వీనర్ దుద్దేకుంట రామాంజినేయులు విమర్శించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగభూషణరెడ్డి, జిల్లా కిసాన్‌సెల్ సభ్యులు బిల్లా తిమ్మారెడ్డి, నియోజకవర్గ సభ్యులు లక్ష్మన్న, కేశవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టని చంద్రబాబు మళ్లీ అధికారం ఇవ్వండి.. మీకోసం పని చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో బెళుగుప్ప మండలంలోని 25 వేల ఎకరాలకు నీరివ్వాలన్న లక్ష్యంతో వంద కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని (జీడిపల్లి రిజర్వాయర్) పథకాన్ని ప్రారంభించారన్నారు. ఆయన జీవించి ఉంటే ఈ పాటికి సాగునీరు కూడా అందేదన్నారు. మండలంలో టీడీపీకి కంచుకోటలుగా చెప్పుకునే తగ్గుపర్తి, వెంకటాద్రిపల్లి గ్రామాలకు కూడా చంద్రబాబు పాలనలో రోడ్లు వేయలేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తరువాత రామసాగరం- బెళుగుప్ప, విరుపాపల్లి -వెంకటాద్రిపల్లి, గుండ్లపల్లి-నక్కలపల్లి, కాలువపల్లి-జీడిపల్లి, దుద్దేకుంట-కోనంపల్లి, రామసాగరం క్రాస్-రామసాగరం, బెళుగుప్ప-సల్లాపురం గ్రామాల మధ్య తారు రోడ్లు వేశారన్నారు . చంద్రబాబు పాలనలో సకాలంలో బిల్లులు చెల్లించలేని రైతుల స్టార్టర్ పెట్టెలను లాక్కు వెళ్లారన్నారు.  కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడమే నిజంగా చంద్రబాబులో జరిగిన మార్పు అని ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి బయట ఉంటే తమ ఆటలు సాగవనే చిదంబరంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజా కోర్టులో అంతిమ విజయం జగన్‌మోహన్‌రెడ్డిని వరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేవారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్‌ సెల్ అద్యక్షులు అశోక్, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, సి. తిమ్మారెడ్డి, శివన్న, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top