బాబుకు మతి భ్రమించింది: షర్మిల

విజయవాడ, 26 మార్చి 2013: విద్యుత్‌ బకాయిల మాఫీపై అడ్డగోలుగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. రెండువేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సంతోషం పట్టలేక ఆయన మతి చలించిందో లేకపోతే అంత దూరం నడిచినా తనకు అధికారం అందేలా లేదన్న నిరాశతో మతి భ్రమించిందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.‌ చంద్రబాబునాయుడు నిన్నటి పాదయాత్రలో మాట్లాడుతూ.. విద్యుత్ బకాయిలను తాను మాఫీ చేశానని, మహానేత వైయస్‌ అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలు వసూలు చేశారని అసత్యాలు చెప్పడాన్ని శ్రీమతి షర్మిల తీవ్రంగా ఖండించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా కృష్ణాజిల్లా విజయవాడలోని అయ్యదేవర కాళేశ్వరరావు మార్కెట్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు,‌ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

8సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన బాబు :
‌ఎనిమిదేళ్ళ ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచేసిన ‌వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు కట్టలేకపోయిన రైతులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, విచారించి శిక్షలు వేయడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసిన ఘనుడు చంద్రబాబే అని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో దారుణంగా పెంచేసిన విద్యుత్‌ బిల్లులు కట్టలేక, ఆయన పెట్టే అవమానాలు భరించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

పేదలను బాబు పురుగుల్లా చూశారు :
పేదలు ఎక్కడ ఉంటారో.. చంద్రబాబు అక్కడ ఉంటారట.. తన పాదయాత్రలో ఆయన ఈ మాట చెప్పుకుంటున్నారు. ఆ మాట విన్నప్పుడు నవ్వొచ్చింది. ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి బిల్‌క్లింటన్‌ వస్తున్నాడని హైదరాబాద్‌లో ఉన్న భిక్షగాళ్లను, చిత్తుకాగితాలు ఏరుకునే వారిని బలవంతంగా లారీల్లో ఎక్కించి ఊరి బయటకు విసిరిపారేయించిన ఘనుడు. ఆయనకు పేదవాళ్లంటే అంత నిర్లక్ష్యం.. అంత చిన్నచూపు. పేదలను ఆయన కనీసం మనుషుల్లా కూడా చూడలేదు. పురుగుల్లా చూశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆయన ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు. పేద విద్యార్థులు ‘మేం చదువుకోలేక పోతున్నాం.. మాకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వండి.. మెస్‌ చార్జీలు పెంచండి..’ అని అడిగిన పాపానికి వారిని లాఠీలతో కొట్టించిన దుర్మార్గుడు ఈ చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. నిరుపేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా లక్షలాది రూపాయలు యూజర్ చార్జీలు వసూలు చేశారు. అలాంటి మనిషి ఇప్పుడు పేదల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.

పరిహారం అందించిన మహానేత :
బాబు హయాంలో ప్రాణాలు తీసుకున్న ఒక్కొక్క రైతు కుటుంబానికీ రూ. 1.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకున్నది మహానేత వైయస్‌ అని శ్రీమతి షర్మిల తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తొలి రోజునే వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తూ తొలి ఫైలుపై సంతకం చేసి అమలు చేశారన్నారు. ఆ మహానేతపై చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని శ్రీమతి షర్మిల తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, 13 వందల కోట్ల విద్యుత్‌ బకాయిలను మాఫీ చేసింది మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నది అందరికీ తెలిసిందే అన్నారు. పన్నులు పెంచకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన నిరాఘాటంగా నిర్వహించారన్నారు. కానీ 'చంద్రబాబు ఈ రోజు నిస్సిగ్గుగా అబద్ధపు మాటలు చెప్తున్నారు. రాజకీయ అవసరాల కోసం పూటకో అబద్ధం చెబుతున్న ఆయనను నాయకుడు అంటారా? ఊసరవెల్లి అంటారా..’ అంటూ నిప్పులు చెరిగారు.

తండ్రి స్థానంలో ఆలోచించిన వైయస్‌ :
ప్రజలను కన్నబిడ్డలు భావించి కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి, వారు అభివృద్ధి చెందాలన్న ధ్యేయంతోనే వైయస్‌ఆర్‌ కార్యక్రమాలు చేశారన్నారు. రుణాలు మాఫీ చేసిందీ వైయస్‌ఆరే అన్నారు. రైతులు, మహిళలకు వడ్డీని రూపాయి నుంచి పావలాకు తగ్గించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందీ ఆయనే అన్నారు. డబ్బులు లేక చదువులు ఆగిపోకూడదని చెప్పి విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటును మహానేత వైయస్‌ చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించి, లక్షల విలువైన కార్పొరేట్‌ వైద్యాన్ని నిరుపేదలకు కూడా అందుబాటులోకి తెచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. కాని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆ ఒక్క మనిషి వెళ్ళిపోవడంతో రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు :
రాష్ట్రంలో మానవత్వం లేని ప్రభుత్వం కొనసాగుతోందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కిరణ్ ‌ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కరెంట్ లేదని అడిగితే.. కిటికీలు, తలుపులు తెరుచుకోమని‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉచిత సలహాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేకపోయినా చార్జీలు, బిల్లులు చూస్తే షాక్ కొడుతున్నాయని అన్నారు.

వ్యాట్పై పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు :
దేశంలో మరెక్కడా లేని విధంగా వస్త్రాలపై ఐదు శాతం వ్యాట్ విధించి, వస్త్ర పరిశ్రమను ఈ ప్రభుత్వం కుదేలు చేసిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.‌ వస్త్రాలపై వ్యాట్‌ను రద్దు చేయాలంటూ 18 రోజులుగా వస్త్ర వ్యాపారులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా బండరాయిలా కూర్చుందని విమర్శించారు. వస్త్ర వ్యాపారంపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యాట్‌ విధించి వారికి అన్యాయం చేసిందన్నారు. తిండి, నీరు, బట్ట మనిషికి కనీస అవసరాలు అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వం వాటిని ప్రజలకు అందకుండా చేస్తోందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. వస్త్ర వ్యాపారులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని, వారి తరఫున పోరాటం చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

మహానేత పథకాలకు తూట్లు :
కాంగ్రెస్ పాలనలో ఎవరికీ భరోసా లేదన్నారు.‌ మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ‌నిప్పులు చెరిగారు. అప్పులు కట్టేందుకు రైతులు ఇంటిలోని వస్తువులు, నగలు, ఒంటిలోని కిడ్నీలకు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని విచారం వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు కూలీ సరిగా ఇవ్వడంలేదని, పక్కా ఇళ్ళకు పాడె కట్టిందని, ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందని, ఫీజు పథకాన్ని నీరుగార్చిందని విమర్శించారు. కొత్త పరిశ్రమల మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమలే మూతపడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

కిరణ్‌ చేతలు శూన్యం :
‌సి.ఎం. కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయని, కానీ చేతలు మాత్రం శూన్యం అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. కిరణ్‌ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా విద్యుత్‌ లేక లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని, 20 లక్షల మందికి పైగా కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆయన అటకెక్కించారని ఆరోపించారు.

చరిత్ర హీనుడిగా మిగిలిన చంద్రబాబు :
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తూ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. జగనన్న బయట ఉంటే వీళ్ల ఆటలు సాగవన్న భయంతో కుట్ర చేసి, సిబిఐని వాడుకుని కాంగ్రెస్‌, టిడిపిలు ఆయనను జైలుకు పంపించాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు. బోనులో ఉన్నా పులి పులే అన్నారు. జగనన్నను ఆశీర్వదించాలని ఆమె అందరికీ విజ్ఞప్తి చేశారు. జగనన్న బయటకు వచ్చి రాజ్యన్న రాజ్యం దిశగా మనందరినీ నడిపిస్తారని భరోసా ఇచ్చారు. తన కోసం వచ్చిన వారందరికీ శ్రీమతి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. 
Back to Top