బాబూ... నిన్ను ప్రజలు నమ్మరు

అనంతపురం: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరితే ఆయన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు’’ అని వైఎయస్ఆర్‌ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితాల దెబ్బకు దిమ్మతిరిగి పాదయాత్ర చేస్తున్నారని, ఇదంతా షూటింగ్‌ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘అనంత’ ప్రజలకు నీవు ఏమి చేశావో చెప్పి పాదయాత్ర కొనసాగించాలని సూచించారు. గతంలో విక్టరీ సంకేతం చూపించిన బాబు ఇప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నారని, ఆయన మారాడని నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సహజంగానే పాదయాత్ర ప్రారంభం రోజున కొద్దోగొప్పో జనం వస్తారని, ఆ తర్వాత అంతంత మాత్రమేనని అన్నారు. కనీసం పది వేల నుంచి 25 వేలమంది కూడా పాదయాత్రలో కనిపించలేదని, జన సమీకరణకు నాయకులు నానా పాట్లు పడుతున్నారని ఆరోపించారు. మరో రెండు రోజులు పోతే స్పందన తగ్గిపోతుందన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్నే మార్చేస్తాడని చెబుతున్నారని, అదెలా సాధ్యమవుతుందో చెప్పాలని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు సిద్ధాంతాలను పాటిస్తూ.. దానికి ఓ సీఈఓ మాదిరిగా చంద్రబాబు పాలన సాగించారని ధ్వజమెత్తారు.

వైయస్ఆర్ అధికారంలోకొచ్చాక ఆయా కుటుంబాలకు రూ.లక్షన్నర ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. బాబు పాలన చీకటి పాలనేనని ఎద్దేవా చేశారు. పీఏబీఆర్ కు చుక్కనీరు తెప్పించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌తో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారన్నారు. ఆయన్ను లొంగదీసుకునేందుకు బెయిల్ రాకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల నాగరాజు, నాయకుడు ఆకుతోటపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top