హోదా కోసం పోరాడితే నోటీసులా..?

()ప్రతిపక్షాన్ని మొత్తం సస్పెండ్‌ చేసినా హోదా పోరాటం ఆగదు
()ప్రజల ఆగ్రహాన్నే మేం సభలో ప్రతిబింబించాం
()కరువు జయించానని బాబు చెప్పడం సిగ్గుచేటు
()టీడీపీ నేతలు ఫ్రాడ్ స్టర్స్ గా ముద్రవేసుకుంటున్నారు
()వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలకు సర్కార్‌ నోటీసులు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే  విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేకహోదాపై చర్చించాలని సభను స్తంభింపజేయడం తప్పా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీ సాక్షిగా రెండుసార్లు ఏకగ్రీవ తీర్మాణం చేశాక ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తే...ప్రధాన ప్రతిపక్షంగా సభలో పోరాడక కాలక్షేపం చేయాలా? అని  ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  హోదాపై చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యేలు బేంచిలెక్కారని చర్యలు తీసుకోవడం హేయనీయమన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశ్వేశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ప్రజల మనోభావాన్నేతాము సభలో ప్రతిబింబించామని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఉదయాన్నే సమావేశాలు పెట్టుకొని అర్థరాత్రి పూట కేంద్ర ప్రకటించిన ప్యాకేజీకి చంద్రబాబు స్వాగతం పలికి రాష్ట్రానికి ద్రోహం చేశారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సభ తీర్మాణాలకు భిన్నంగా ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను సంప్రదించకుండా నలుగురు కూర్చొని ఎలా ప్యాకేజీని స్వాగతిస్తారని ప్రశ్నించారు. 5 కోట్ల ఆంధ్రప్రజల ఘోష మీకు పట్టదా అని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. 

ఫిరాయింపులపై చర్యలుండవా?
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా పెట్టుకొని గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా బాబూ అని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బాబుతో కలిసి ఫోటోలు తీసుకుంటే వారిపై చర్యలుండవా..? ఫిరాయింపులు సభ గౌరవాన్ని పెంపొందిస్తున్నాయా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరినా స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన జ్యోతుల నెహ్రూను ప్రివిలేజ్‌ కమిటీలో సభ్యుడిగా తీసేసి ఎమ్మెల్యే చెవిరెడ్డిని చేర్చాలని ప్రతిపక్షనేత వైయస్ జగన్, కమిటీ సభ్యుడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కోరినా సాంకేతిక కారణాలు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అన్ని పదవులకు రాజీనామా చేశానని చెప్పిన నెహ్రూ కమిటీ సమావేశాలకు ఎందుకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. శాసనసభ స్పీకర్‌ సాంకేతిక తప్ప నైతికత పాటించారా అని చురకంటించారు. అసలు ప్రివిలేజ్‌ కమిటీ ఉద్దేశ్యమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ, ప్రతిపక్షాన్ని అణచివేయాలని కుట్రలు చేస్తోందన్నారు. సభా మర్యాదల పేరుతో రాష్ట్రానికి ద్రోహం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 12 మందిపై కాదు ప్రతిపక్షాన్ని మొత్తం సస్పెండ్‌ చేసినా హోదాపై చివరి వరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

కరువుపై ఇంత నిర్లక్ష్యం తగదు
కరువుపై విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు రెయిన్‌ గన్‌లతో ఎంత పంటను కాపాడారో చూపించాలని విశ్వేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే జయించామని చెప్పుకుంటూ సన్మానాలు, సభలు ఏర్పాటు చేసుకొని టీడీపీ నేతలతో పొగిడించుకోవడం సిగ్గుచేటని బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కరువు ప్రాంత ప్రజల పట్ల బాబు పరిహాసం ఆడుతున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  వర్షాపాత లోటుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం హేయనీయమన్నారు. అక్టోబర్‌ నెల చివరికి వచ్చినా ఇప్పటికీ స్పందించలేదంటే కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి ఎప్పుడు రప్పిస్తారు... నివేదిక ఎప్పుడు పంపుతారని ప్రశ్నించారు. కరువుపై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదని హితవుపలికారు. గంటలు గంటలు క్యాబినెట్‌ మీటింగ్‌లతో కాలం వెళ్లదీస్తున్న సీఎం ఒక్క ఐదు నిమిషాలైనా సమావేశాల్లో కరువుపై చర్చించారా..? వ్యవసాయం గురించి గొప్పలు చెప్పుకునే బాబు రైతుల పాలిట ప్రధాన శత్రువుగా మారాడని విమర్శించారు. ఇప్పటికైనా సర్వే ద్వారా రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

వైయస్‌ జగన్‌పై బురదజల్లితే గొప్పవారైపోరు
టీడీపీ నేతలు పనిగట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లాలని చూస్తున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు ఫ్రాడ్‌ మెసేజ్‌లు ఇస్తూ ఫ్రాడ్‌స్టర్స్‌గా ముద్ర వేసుకుంటున్నారని ఆరోపించారు.  మంత్రి పదవి కోసమే వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తున్నారని ఫైరయ్యారు. వైయస్‌ జగన్‌పై బురదజల్లినంత మాత్రాన గొప్పవారైపోరని చురకంటించారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రజల గురించి, రైతుల ఆత్మహత్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తూ కాలక్షేపం చేయడం మానుకోవాలని సూచించారు. గోబెల్స్‌ ప్రచారాన్ని నమ్ముకొని టీడీపీ నేతలు ఉండడం దురదృష్టకరమన్నారు. కమీషన్లు, కాంట్రాక్టుల అంశాలను పక్కనబెట్టి రైతులు, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని హితబోధ చేశారు. 
 
Back to Top