అప్పులపాలు చేస్తున్న ప్రభుత్వ వైఖరి

తాడేపల్లిగూడెం, 23 మే 2013:

‘ఎంత కష్టపడినా అప్పులే మిగులుతున్నాయమ్మా. వరి పంట వేసి నష్టపోతున్నాం. నీళ్లు లేక దిగుబడి తగ్గిపోతోంది. పండిన ధాన్యానికి మద్దతు ధరా ఇయ్యట్లేదు. నాన్నగారున్నప్పుడు అందరికీ ఉపకారం జరిగింది. ఇప్పుడు అందరూ ఉసూరుమంటున్నారు’ అంటూ పలువురు రైతులు శ్రీమతి వైయస్  షర్మిల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాకంటక పాలనకు, దానికి వంతపాడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సాగింది.

పెంటపాడు మండలం యానాలపల్లిలో రైతులు శ్రీమతి షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. ఎకరం పొలం సాగు చేయడానికి రూ.22 వేలు ఖర్చవుతుందనీ, కానీ తమకు ఏమీ మిగలడం లేదనీ, అప్పులే మిగులుతున్నాయనీ  వాపోయారు. పండిన ధాన్యానికి మద్దతు ధర రావడంలేదని, ఎరువులు, పురుగుమందులతోపాటు అన్నింటి ధరలూ పెరుగుతున్నా మద్దతు ధర పెరగడంలేదని మరో రైతు తాడి గోపాలకృష్ణ వాపోయాడు. ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశాడు. వచ్చేది కౌలుకే సరిపోతుందని మాదాసు కనకయ్య చెప్పాడు. గతేడాది నీలం తుపానుకు పంటంతా పోయిందని, ఇప్పటివరకూ పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. త్వరలోనే ఈ కష్టాలన్నీ తీరుతాయని, మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో రైతుల కష్టాలు తీర్చేందుకు జగనన్న ప్రత్యేక చర్యలు తీసుకుంటారని షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

ఏళ్లయినా స్థలాలివ్వడంలేదు
ఇదే మండలంలోని పరిమెళ్ల ఎరుకల కాలనీ మీదుగా శ్రీమతి షర్మిల వెళ్లినప్పుడు అక్కడి గడిసెవాసులు  తమ సమస్యలు చెప్పుకొన్నారు. ‘ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు పక్కన ఈ గుడిసెల్లోనే ఉంటున్నాం. గుడిసెల్లోంచి బయటకు వస్తే మా పిల్లలు కార్లు, ఆటోల కింద పడతారేమోనని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాజశేఖరరెడ్డిగారు ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి భూమి కూడా కొన్నారని, ఆయన చనిపోవడంతో తమ ను ఎవరూ పట్టించుకోవడంలేదని నక్కా పెద్దిరాజు, చిన్నవెంకమ్మ వాపోయారు. ‘‘జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు వస్తాయన్నా.. ధైర్యంగా ఉండండి’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.

బల్బు, ఫ్యానుకు 1,700 కరెంటు బిల్లు
ఆ పక్కనే ఉన్న గుడిసెలోని నక్కా ధనపండు, అతని భార్య అంజమ్మలు తమకు వచ్చిన కరెంటు బిల్లులను తీసుకువచ్చి శ్రీమతి షర్మిలకు చూపించారు. తమ గుడిసెలో ఒక బల్బు, ఒక ఫ్యాను మాత్రమే ఉన్నాయని, కానీ బిల్లు ఇంత వచ్చింది చూడండమ్మా అన్ని చూపించారు. ఒక నెల రూ.1,200, మరో నెల రూ. 1,700 బిల్లులు వచ్చాయి. రెండు నెలలు కలిపి రూ. మూడు వేల దాకా బిల్లు వచ్చిందని చూపిస్తూ ఇంత సొమ్మును తాము ఎలా కట్టాలో తెలియడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరిమెళ్లలో జరిగిన రచ్చబండలో మహిళలు తమకు ఇళ్లు లేవని తమ గోడు వినిపించారు. ‘త్వరలోనే మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు అందరి కష్టాలూ తీరుతాయి. జగనన్నను ఆశీర్వదించండి’’ అని శ్రీమతి షర్మిల కోరారు.

Back to Top