ఆధార్తో ముడి.. స్కూళ్లకు ఉరి

చంద్రబాబు సర్కారు కొత్త స్కీమ్
స్కూలు ఉండాలంటే చదువుకునే పిల్లలుండాలి... చదువుచెప్పే మాస్టర్లుండాలి. పిల్లలున్నా మాస్టర్లు లేకపోవడం గ్రామాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లలు ఉన్నా మాస్టర్లు ఉన్నా గ్రామాల్లో ఉన్న స్కూళ్లను ఎత్తేస్తామని ప్రభుత్వం చెబుతుంటే ఏమనుకోవాలి. ఆధార్ గణాంకాలను బట్టి స్కూళ్లు ఉంచాలా తీసేయాలా అన్నది నిర్ణయించాలని రాష్ర్టప్రభుత్వం భావిస్తోంది. విద్యాసంవత్సరం ఆరంభంలో పిల్లలకు పుస్తకాలు సకాలంలో అందించాలని, ఉపాధ్యాయ ఖాళీలుంటే త్వరగా భర్తీ చేయాలని, ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటుంటే ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ చంద్రబాబు సర్కారు పూర్తి డిఫరెంట్గా ఆలోచిస్తోంది. ఏకంగా స్కూళ్లనే తీసేయాలని చూస్తోంది. ఆధార్ గణాంకాలను బట్టి స్కూళ్లను రేషనలైజ్ చేయాలని భావిస్తోంది. రేషనలైజేషన్ అంటే నిర్ణీత సంఖ్యలో పిల్లల కన్నా టీచర్లు ఎక్కువ ఉంటే అదనంగా ఉండే టీచర్లను ఇతర పాఠశాలలకు తరలిస్తారు. అదేసమయంలో నిర్ణీత సంఖ్య కన్నా తక్కువ పిల్లలున్న స్కూళ్లను ఇతర పాఠశాలలో విలీనం చేస్తారు. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులకు ఒక కిలోమీటర్ పరిధి దాటి ఉండరాదన్న నిబంధనను పాటిస్తూ ఈ విలీన ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే విద్యార్థుల గణాంకాలను బట్టి పాఠశాలలను నిర్ణయించడమనేది పాత నిబంధనే అయినా పాఠశాలల్లో విద్యార్థుల గణాంకాల కోసం ఆధార్ను ఆశ్రయించడమే కొత్త సంగతి. గతంలో పాఠశాలల్లో విద్యార్థుల గణాంకాల కోసం డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (డైస్) నివేదికలను ప్రాతిపదికగా తీసుకునేవారు. ఈ నివేదికను టీచర్లు ఇస్తుండడంతో వాటిపై ప్రభుత్వానికి నమ్మకం కుదరక ఆధార్ను ఆశ్రయించింది. అయితే ఆధార్ను ఆశ్రయించడం అసలుకే ఎసరు తెస్తుందన్న విషయాన్ని సర్కార్ గుర్తించడం లేదు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ అసంపూర్తిగానే  జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవు. అందువల్ల వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కలేదు. తద్వారా స్కూళ్లలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. విద్యాశాఖాధికారులు ప్రభుత్వ ఆదేశాలను బట్టి ఆధార్ కార్డులు లేని విద్యార్థుల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారు. పిల్లలున్నా ఆధార్ కార్డులు లేవన్న కారణంతో పేర్లను తొలగించి రూపొందించే గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటే అనేక స్కూళ్లు మూత పడడం ఖాయం. పాఠశాలల్లో తగినంత మంది పిల్లలు లేకపోతే అక్కడ ఉన్న టీచర్లలో జూనియర్లను వేరే పాఠశాలలకు బదిలీ చేస్తారు. జూనియర్ టీచర్లు లేకపోతే పిల్లలను పాఠశాలల్లో చేర్పించేవారే ఉండరు. ఆ పనిని సీనియర్ టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు చేయరు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆధార్ చుట్టూ ముడిపడి ఉన్నాయి.
Back to Top