అంద‌రూ ఒక్క‌టైన వేళ ఏపీ బంద్ సంపూర్ణం- క‌దం తొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
- అడుగ‌డుగునా అడ్డుకున్న పోలీసులు
- మండుటెండల‌ను లెక్క చేయ‌ని ఉద్య‌మ‌కారులు
 - నిలిచిపోయిన ర‌వాణా వ్య‌వ‌స్థ‌
అమ‌రావ‌తి: ఎండ‌లు మండుతున్నా..వారి గుండె మండ‌లు చ‌ల్లార‌లేదు. ప్ర‌త్యేక హోదా అంటూ ఆగ్ర‌హ జ్వాల‌ల‌తో మండిప‌డ్డారు. ప‌దం క‌లిపారు.. కదం తొక్కారు. అంద‌రూ ఒక్క‌టై ఐదు కోట్ల ఆంధ్రుల హ‌క్కు కోసం ముక్త‌కంఠంతో నిన‌దించారు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన బంద్ విజ‌య‌వంతమైంది. ప్ర‌త్యేక హోదాపై ప్ర‌తి గుండె ఎలా ప‌రిత‌పిస్తోందో స్ప‌ష్ట‌మైంది. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌కు పాత‌రేసి, ఇచ్చిన మాట త‌ప్పిన నేత‌ల‌కు రేప‌టి రోజున గ‌ట్టిగా బుద్ధి చెబుతామ‌ని రోడ్డెక్కిన జ‌నం ప్ర‌తిన‌లు చేశారు. ప్ర‌తిజ్ఞ ప‌ట్టారు. అనంత‌పురం, చిత్తూరు, వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, వైజాగ్‌,  విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బంద్‌లో పాల్గొని రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీతో క‌లిసి వామ‌ప‌క్షాలు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు ఉద్య‌మించడం ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని చాటి చెప్పింది. నాలుగేళ్లుగా హోదా సాధ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు పోరాటం చేసిన విష‌యం విధిత‌మే. ఉద్య‌మంలో భాగంగా ఇటీవ‌ల నిర్వ‌హించిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఏ రోజు కూడా కేంద్రం ఈ విషయంలో చ‌ర్చించేందుకు ముందుకు రాక‌పోగా ప్ర‌ధాని ఇటీవ‌ల ఢిల్లీలో దీక్ష చేప‌ట్ట‌డం విడ్డూరం. అంతేకాదు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు వైయ‌స్ జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టారు. ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీతో పాటు వివిధ పార్టీలు త‌ల‌పెట్టిన బంద్‌ను భ‌గ్నం చేసేందుకు చంద్ర‌బాబు అడుగ‌డుగునా ఆంక్ష‌లు విధించారు. ముంద‌స్తుగా నోటీసులు జారీ చేయ‌డంతో పాటు అక్ర‌మ అరెస్టుల‌తో భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసింది. పోలీసుల‌తో ఉద్య‌మాన్ని అణ‌చివేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. అయినా మొక్క‌వోని దీక్ష‌తో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు బంద్‌ను విజ‌య‌వంతం చేయ‌డంతో మ‌రోమారు ప్ర‌త్యేక హోదా నినాదం మార్మోగింది. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా వైయ‌స్  జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో పోరాటం చేసి ప్ర‌త్యేక హోదాను సాధించుకుంటామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.
Back to Top