అన్నదాతలను హింస పెట్టిన చంద్రబాబు

గౌరారం (నల్గొండ జిల్లా), 13 ఫిబ్రవరి 2013: రైతులను చంద్రబాబు నాయుడు తన పాలనా కాలంలో తీవ్రంగా హింసపెట్టారని మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పెట్టే బాధలు తట్టుకోలేక మన రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బాబు హయాంలో టిడిపి వారు మాత్రమే బాగుపడ్డారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగనన్న అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తారని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దాని పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా‌ మరో వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా బుధవారంనాడు ఆమె నల్గొండ నియోజకవర్గంలోని గౌరారంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని అనంతరం ప్రసంగించారు.

ఇప్పుడున్నది మన ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కాంగ్రెస్‌ పార్టీని దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజ‌శేఖరరెడ్డి గెలిపించారు కానీ ఆయన పేరును దోషిగా ఇప్పటి ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ పెట్టిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని, సేవ చేసుకోవాలని, రాజన్న పేరు నిలబెట్టాలని కాంగ్రెస్‌ నుంచి జగనన్న బయటికి వచ్చారని ఆమె పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడాలని అన్న అనుకుంటున్నారన్నారు. జగనన్నను ఆశీర్వదించండని విజ్క్షప్తి చేశారు. జగనన్నను ఆశీర్వదిస్తే మీ గ్రామమే కాదు రాష్ట్రంలోని ప్రతి గ్రామమూ బాగుపడుతుందని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. అందరూ నమ్మకం పెట్టుకోండి మంచి రోజులు తప్పకుండా వస్తాయని అన్నారు.

రచ్చబండలో స్థానికులు శ్రీమతి షర్మిలకు తాము ఎదుర్కొంటున్న అగచాట్లను వివరించారు. తమ గ్రామాలకు రోడ్లు సరిగా లేవని, రోజుకు కనీసం మూడు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని, తమ గ్రామంలో మంచినీరు, కనీస సౌకర్యాలేవీ లేవని వారు మొరపెట్టుకున్నారు. విద్యుత్‌ చార్జీలు ఇష్టం వచ్చిన రీతిలో ఈ ప్రభుత్వం పెంచేస్తున్నదని, పెరిగిన బిల్లులు కట్టలేకపోతున్నామని వాపోయారు. వృద్ధులకు పింఛన్‌ అందడంలేదని చెప్పారు. పావలా వడ్డీ రుణాలు అందడంలేదని ఫిర్యాదు చేశారు. స్థానికుల సమస్యలు సావధానంగా విన్న శ్రీమతి షర్మిల స్పందించారు. జగనన్న సిఎం అయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయని వారికి శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. ఇప్పుడు వృద్ధులు, వితంతువులకు రూ. 200‌ మాత్రమే పింఛన్ వస్తోందని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రూ.700కు, వికలాంగులకు రూ. 1,000 కు పెంచుతారని ఆమె భరోసా ఇచ్చారు. తప్పకుండా ఆదుకుంటారని చెప్పారు. మహిళలకు అండగా ఉండాలన్న సదుద్దేశంలో రాజన్న పెట్టిన అభయ హస్తం పథకాన్ని జగనన్న తప్పకుండా కొనసాగిస్తారని అన్నారు.

వివిధ సమస్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ స్థానికులను వాటిపై స్పందించాలని శ్రీమతి షర్మిల అడిగి తెలుసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. స్థానికులకు వారి సమస్యలపై అవగాహన కలిగేలా చేశారు. మహానేత వైయస్‌ ఉన్నప్పుడు తమకు పింఛన్‌లు సక్రమంగా అందేవని, ఇప్పటి ప్రభుత్వం కటింగ్‌ చేసేసిందని కొందరు వాపోయారు. రోజుకు ఒకటి ఒకటిన్నర గంటలకు మించి కరెంటు ఇవ్వరని, అయితే బిల్లు మాత్రం పెద్దగా వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులు పెంచి రూ. 32,000 కోట్లు ప్రజల నెత్తిన ఆర్థిక భారం వేసిందని దుయ్యబట్టారు. బిల్లుల భారం వేసి ప్రజల రక్తం పీలుస్తోందన్నారు. మహానేత వైయస్‌ ఉన్నప్పుడు విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా పరిపాలించిన ఏకైక రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ ఒక్కరే అన్నప్పుడు స్థానికుల చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రాజన్న బాటలోనే జగనన్న కూడా నడుస్తారని, గ్రామాలను బాగు చేస్తారని హామీ ఇచ్చారు.

అంతకు ముందు శ్రీమతి షర్మిల కనగల్‌ మండలం అమ్మగూడెంలో ఎండిపోయిన బత్తాయితోటను పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

Back to Top