ఆనాడు వెంక‌య్య అడ‌గ‌లేదా? వైఎస్ జ‌గ‌న్‌

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్ర ప్ర‌త్యేక హోదా అంశంపై ఆనాడు రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన బీజేపీ.... ఇప్పుడు  అధికారంలోకి వ‌చ్చాక ఎందుకు వెన‌క్కు త‌గ్గుతోంద‌ని వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా కోరుతూ ఢిల్లీలో సోమ‌వారం జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద వైఎస్సార్‌సీపీ ధ‌ర్నా చేప‌ట్టింది. దీనిలో భాగంగా ఏఎన్ఐతో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్‌..... ఆనాడు ఏపీకి 10 ఏళ్ల ప్ర‌త్యేక హోదా కావాల‌ని రాజ్య‌స‌భ‌లో వ్యాఖ్యానించిన వెంక‌య్య‌నాయుడు...... నేడు ప్ర‌త్యేక హోదా అంశం చ‌ట్టంలో లేద‌ని అన‌డానికి కార‌ణం ఏమిట‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై నాటి పెద్ద‌ల స‌భ‌లో అరుణ్‌జైట్లీ కూడా మాట్లాడిన సంగ‌తిని వైఎస్ జ‌గ‌న్ గుర్తు చేశారు. ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి బీజేపీతో పాటు, కాంగ్రెస్‌, టీడీపీ లు కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. బీజేపీ ఇచ్చిన హామీ నిల‌బెట్టుకుని ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్నారు. ఏపీ ప్ర‌త్యేక హోదాపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు   మాట్లాడ‌క పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప‌క్క‌కు పెట్టిన టీడీపీ.....అవినీతి డ‌బ్బుతో ఇత‌ర  పార్టీల నేత‌ల‌ను కొనుగోలు చేయ‌డానికే మొగ్గుచూపుతుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

 ప్ర‌త్యేక హోదా కోసం   చేస్తున్న డిమాండ్ కొత్త‌ది కాదని, కాంగ్రెస్ అప్ర‌జాస్వామికంగా రాష్ట్రాన్ని విడ‌గొట్టిందని వివ‌రించారు. ఆనాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా స‌రిపోదు..... ప‌దేళ్లు కావాల‌ని బీజేపీ   డిమాండ్ చేసింది. మ‌రి  పార్ల‌మెంట్‌లో ఇచ్చిన మాట‌కు విలువ లేక‌పోతే ఎలా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాకు 14వ ఫైనాన్స్ క‌మిష‌న్‌కు సంబంధం లేదు, ప్ర‌త్యేక హోదాను ఫైనాస్స్ క‌మిష‌న్ వ‌ద్ద‌ని సూచించ‌డం దారుణం అన్నారు.    15 నెల‌లుగా ఒక్క‌సారిగా కూడా పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక హోదాపై కాంగ్రెస్ డిమాండ్ చేయ‌లేదని గుర్తు చేశారు.

త‌ర్వాత జ‌గ‌న్ చంద్ర‌బాబు వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు.  ప్ర‌త్యేక‌హోదా కోసం చంద్ర‌బాబు అడుగుతానంటే  ఎప్పుడూ అడ్డుప‌డ‌లేద‌ని, అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాల‌ని కోరినా స్పందించ‌లేద‌ని వివ‌రించారు. అస‌లు  సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని చంద్ర‌బాబు తాక‌ట్టు పెడుతున్నారని మండిప‌డ్డారు. కేసులు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయోన‌ని భ‌యం తోటే చంద్ర‌బాబు రాజీ ప‌డుతున్నారని వైఎస్ జ‌గ‌న్ అభివ‌ర్ణించారు.
Back to Top