హైదరాబాద్, 16 అక్టోబర్ 2012: 'అమ్మ' చిత్ర ప్రదర్శనను తిలకించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చలించిపోయారు. హైదరాబాద్‌లోని బాలయోగి పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనను సోమవారంనాడు విజయమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ, ‘మాతృప్రేమపై డాక్టర్ ప్రహ్లాద్ వేసిన చిత్రాలను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం దూరమైన మా అమ్మ గుర్తుకొస్తా ఉంది. అమ్మ లేని లోటు చాలా బాధగా ఉంటుంది’ అన్నారు. దక్షిణ మధ్య రైల్వేో సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన డాక్టర్ ప్రహ్లాద్ ‘అమ్మ’ పేరుతో రాష్ట్ర రాజధాని నగరంలో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
‘మనిషిని ప్రేమించేందుకే దేవుడు అమ్మను సృష్టించాడు. అమ్మ లేకుండా ఏదీ లేదు. సృష్టిలో నిస్వార్థంగా బిడ్డలను ప్రేమించేది అమ్మ ఒక్కరే. కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా పంచుకోలేక అమ్మను చాలా మిస్ అవుతున్నా. అమ్మ విలువేంటో ఇప్పుడు తెలుస్తోంది. అమ్మ ఎవరికైనా చెడ్డది కావచ్చు. కానీ బిడ్డలకు మాత్రం కాదు. అమ్మ స్పర్శ అనిర్వచనీయం. బిడ్డ మాత్రమే తల్లి స్పర్శను గుర్తించగలడు. తల్లీ బిడ్డలను పైకి తెచ్చేందుకు ప్రతిఫలం ఆశించకుండా శాయశక్తులా కృషి చేస్తుంది. వారి శ్రేయస్సు కోసం ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది. అమ్మలేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ సృష్టిలో అమ్మ లేకుండా ఏదీ లేదు. డాక్టర్ ప్రహ్లాద్ చిత్రాల్లో అమ్మ విలువ తెలుస్తోంది’ అని విజయమ్మ అన్నారు.
అమ్మ అనే పదానికి విజయమ్మ సరైన నిర్వచనమని చిత్రకారుడు డాక్టర్ ప్రహ్లాద్ అన్నారు. అమ్మను ప్రేమించని వాడు మనిషే కాదని, అమ్మ లేకపోతే ప్రపంచమే లేదని, చిన్నప్పుడే చనిపోయిన అమ్మకు గుర్తుగా ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశానని తెలిపారు. ఈ నెల 21 వరకు చిత్ర ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. విజయమ్మ వెంట వైయస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు.