<br/>హైదరాబాద్: కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు అన్యాయం కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడం వెనుక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం దారుణమని అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగనే కారణమా అని ప్రశ్నించారు.<br/>ఏపీలో మంద క్రిష్ణ మాదిగకు ఏం పని అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఇది బాగానే ఉంది కానీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య ఉద్యమాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తీరు మార్చుకోవాలని చురకలు అంటించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ముద్రగడ ఎందుకు దీక్షకు దిగుతారని అంబటి ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ నేతలు ముద్రగడను విమర్శిస్తున్నారని ఆరోపించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాపు జాతి చంద్రబాబును క్షమించదని అన్నారు. చంద్రబాబు కాపు ద్రోహిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. ముద్రగడ దీక్షను తక్షణమే విరమింపజేయాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి అన్నారు. తీవ్ర పరిణామాలు అంటే విపరీతార్థాలు తీయవద్దని, రాజకీయంగా తీవ్రత ఏర్పడుతుందని ఆయన వివరణ ఇచ్చారు. <br/>