అంబేద్కర్‌కు విజయమ్మ ఘన నివాళులు

హైదరాబాద్‌, 6 డిసెంబర్‌ 2012: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ 56వ వర్ధంతిని గురువారం ఉదయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయి 56 సంవత్సరాలైపోయిందని అన్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ, అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అగ్రవర్ణాలతో సమానంగా దళితులను అభివృద్ధి చేయాలని ఆమె ఆకాంక్షించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా సమానత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలు అభివృద్ధి పథంలో పయనించాలని విజయమ్మ అభిలషించారు. కులాలు, వర్గాలు లేని సమసమాజం రావాలని అంబేద్కర్‌ చేసిన కృషే మనకు గుర్తుకు వస్తుందని అన్నారు. అన్ని రంగాలలో దళితులు, వెనుకబడిన వారికి సమానావకాశాలు కల్పించాలని అంబేద్కర్‌ తుది వరకూ కృషి చేశారని కొనియాడారు.

దళితుల అభివృద్ధి కోసం దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో తపించారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. అంబేద్కర్‌ ఆశయాలను మహానేత వైయస్‌ పాటించారని పేర్కొన్నారు. దళితులు, అణగారిన వర్గాలకు అంబేద్కర్‌ చెప్పిన హక్కులు కల్పించేందుకు ఆయన ఎంతగానో శ్రమించారన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను మహానేత వైయస్‌ ఆచరణలో చేసి చూపించారన్నారు. దళితులకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వారికి ఉచితంగా కార్పొరేట్‌ వైద్య సౌకర్యం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యా సదుపాయం కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారు అభివృద్ధి చెందేందుకు ఎన్నో బాటలు వేశారన్నారు.

జగన్‌ బాబు కూడా దళితుల జీవితాలు బాగుపడాలని వారి కోసం ఎన్నో పథకాలు ప్రకటించారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. తండ్రి ఆశయాలను అమలు చేయడమే తన లక్ష్యంగా జగన్‌బాబు పనిచేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చడమే మనం అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.

Back to Top