చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదు

  • బలవంతలపు భూసేకరణను అడ్డుకుంటాం
  • గుంటూరు పెనుమాకలో ఆగ్రహించిన రైతులు
  • కోర్టు తీర్పును ఉల్లంఘించిన సీఆర్‌డీఏ అధికారులు
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
గుంటూరు: బలవంతపు భూ సేకరణలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పెనుమాకలో సీఆర్‌డీఏ అధికారులు రైతులతో సమావేశం పెట్టి గౌరవన్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. పెనుమాకలో భూసేకరణ నోటిపికేషన్‌ ఇచ్చిన తరువాత మూడు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ రైతులంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు తీర్పు ప్రకారం రైతులు మీటింగ్‌లో వారి అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా రాసిచ్చారన్నారు. మా అభ్యంతరాలపై మీకున్న అభిప్రాయాలు చెప్పండి. అదే విధంగా మినిట్స్‌ బుక్‌లో ఎంటర్‌ చేసుకోండి అని రైతులు కోరితే డిప్యూటీ కలెక్టర్‌ మినిట్స్‌ బుక్‌లో రాయం..  హైకోర్టు తీర్పును లెక్క చేయం.. మీరు కాగితాలు ఇచ్చిపోండి అని చెప్పడం జరిగిందని ఆర్కే స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించారన్నారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం...
ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఆర్‌డీఏ కమీషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కుమ్మకై వారి రియలెస్టేట్‌ వ్యాపారానికి అడ్డుపడుతున్న రైతులకు గౌరవ న్యాయస్థానం అండగా నిలిచినా వాటిని లెక్క చేయడం లేదన్నారు. ఈ రోజున అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్‌ చట్టబద్ధంగా లేకపోవడంతో రైతులు అడ్డుకోవడం జరిగిందన్నారు. కలెక్టర్‌కు ఇచ్చిన విన్నపాలన్నింటినీ ఫైల్‌ చేశామని, వీటన్నింటినీ తీసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బలవంతపు భూ సేకరణను వ్యతిరేకించి తీరుతామని ఆర్కే చంద్రబాబును హెచ్చరించారు. 

చంద్రబాబుకు తొత్తులుగా మారారు: పొన్నవోలు
రైతులు రాతపూర్వకంగా అభ్యంతరాలు ఇచ్చిన తరువాత హియరింగ్‌ జరపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నపోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. రైతులు అభ్యంతరాలు రాసుకోవాల్సిన బాధ్యత డిప్యూటీ కలెక్టర్‌పై ఉందన్నారు. వారు అవేవి ఖాతరు చేయకుండా ప్రభుత్వానికి బానిసై, చంద్రబాబుకు తొత్తులుగా మారి రైతుల గొంతులు కోయడానికి సిద్ధపడ్డారన్నారు. మీటింగ్‌కు వచ్చేటప్పుడే ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోకూడదని చెవుల్లో దూదులు పెట్టుకొని, కళ్లకు గుంతలు కట్టుకొని వచ్చారన్నారు. సభ సజావుగా జరిగిందని సీఆర్‌డీఏ అధికారులు కోర్టుకు వెళితే, ఈ వీడియో రికార్డులను కోర్టు ముందు పెట్టి వారికి తగిన శాస్తి జరిగేలా చేస్తామన్నారు. 
Back to Top