రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాల

సాక్షి ప్రసారాల నిలిపివేతకు నిరసనగా ఆందోళన
జర్నలిస్ట్ ల ర్యాలీలు, ధర్నాలు
ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ప్రజాస్వామ్యవాదులు

సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనజ్వాల వెల్లువెత్తుతోంది. జర్నలిస్టు సంఘాల నాయకులు సహా ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  పలుజిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. తక్షణమే ప్రసారాలు పునరుద్ధరించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు భారీ ధర్నా చేపట్టారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మీడియాపై ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులు ఎండగట్టారు. జీవితకాలం టీడీపీ ఉంటుందని విర్రవీగొద్దని ప్రజాసంఘాలు, ప్రజస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాలో ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. 

గుంటూరు జిల్లాలోనూ సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలంటూ బాపట్లలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శించారు. అక్కడి ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. నర్సారావుపేటలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలోనూ జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని లేకపోతే ఉద్యమాన్ని జాతీయస్థాయి వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అడిషినల్ సీపీఖాన్, కలెక్టర్ యువరాజ్ కు వినతిపత్రం ఇచ్చారు. పాడియేలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీవో హరినారాయణకు వినతిపత్రం సమర్పించారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ మధురవాడలోనూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. పెందుర్తిలోనూ జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిప్రతం సమర్పించారు.

విజయనగరం  జిల్లాలో కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాకు దిగి, మానవహారం నిర్వహించారు. సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్కు జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు.

తిరుపతిలోనూ మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు చెంగయ్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిప్రతం సమర్పించారు.

వైయస్ఆర్ జిల్లా లోనూ సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలంటూ సోయమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ధర్నాకు అక్కడి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బద్వేల్ లో కూడా జర్నలిస్టులు భారీ ర్యాలీ చేపట్టగా ప్రజాసంఘాలు సైతం తమ మద్దతును తెలిపాయి. ప్రొద్దుటూరులో జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకు వినతిప్రతం సమర్పించారు.

Back to Top