జగనన్న ముఖ్యమంత్రి అయితే 'రాజన్న రాజ్యం'


రాకెట్ల
2 నవంబర్ 2012 : జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ 'రాజన్న రాజ్యం' వస్తుందని షర్మిల అన్నారు. తనతో సమస్యలు చెప్పుకున్న మహిళలను ఓదార్చుతూ ఆమె ప్రభుత్వం తీరును ఆక్షేపించారు. అన్ని విధాలా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని ఆమె విమర్శించారు.
అమాంతం పెరిగిన వంటగ్యాస్ ధర, నామమాత్రంగా మారిన ఉపాధిహామీ పథకం, సరిగా అందని పెన్షన్లు, కరెంటుకు కటకట, గుండె గుభిల్లుమనే బిల్లులు, నీటి కరువు...ఇలా పలు సమస్యలపై మహిళలు మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గం పెన్నా అహోబిలం, రాకెట్ల గ్రామాలవాసులు రోడ్డుపక్కనే షర్మిలతో మాట్లాడుతూ తమ సమస్యలు ఏకరువు పెట్టారు.
16వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల తమ పల్లె గుండా సాగుతున్నప్పుడు ఈ గ్రామాల మహిళలు ఆమెను కలుసుకున్నారు. "అవి కట్టండి, ఇవి కట్టండి అంటూ కరెంటు ఇవ్వడానికి సతాయిస్తున్నారు..." అని రాకెట్లలో ఒక మహిళ ఫిర్యాదు చేశారు. మరొకరు "ఉపాధిహామీపథకం కొన్ని రోజులుంటుంది. కొన్ని రోజులుండదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో మహిళ "బకాయిలు కట్టమంటున్నారు. అప్పుడే కరెంటు ఇస్తామంటున్నారు" అని అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు.
"కరెంటు ఉండడం లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దీంతో పనులే కావడం లేదు. కరెంటు లేక, నీళ్లు లేక అగచాట్లే అగచాట్లుగా ఉంది" అని ఒక మహిళ వాపోయారు. పింఛన్లు సరిగా అందడం లేదనీ, వికలాంగుల పింఛన్ల కోసం ఎదురుతెన్నులు చూడవలసి వస్తోందని మహిళలు సమస్యల చిట్టా విప్పారు.
ఇలా వారు తమ కష్టాలు చెప్పుకోగా, మరికొన్నాళ్లు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని షర్మిల వారిని ఓదార్చారు. రాజన్న రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం మానేసిందని నిందించారు. పెన్నా అహోబిలంలోనూ మహిళలు ఇదే రీతిలో సమస్యలు చెప్పుకున్నారు. వైయస్ ఉన్న రోజుల్లో ఎలా ఉండేదని షర్మిల మహిళలను అడిగారు. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు ఎంతో బాగుండేదని మహిళలు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పంటలు లేవనీ, చివరకు పశువులకు మేత సైతం ఉండడం లేదని వారు వాపోయారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న తమకు ఈ ప్రభుత్వం అండగా నిలవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మీ కష్టాలకు కారణమైన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారనీ, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదనీ షర్మిల వ్యాఖ్యానించారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్లీ 'రాజన్న రాజ్యం' వస్తుందని ఆమె మహిళలతో అనునయంగా అన్నారు. ఇదిలావుండగా షర్మిల తన పదహారవ రోజు పాదయాత్రలో 12.3 కి.మీలు నడిచారు. కాగా, మొత్తం నేటి వరకు 213.6 కి.మీల మేర ఆమె నడక సాగింది.

Back to Top