ఏలేరు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాం

హైదరాబాద్, 14 ఏప్రిల్‌ 2013: అన్నదాతల గోడును కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని వర్గాల సంక్షేమాన్నీ ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీద్దామంటే ఈ ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహించలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. మహానేత వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం రైతుల గురించే ఆలోచించేవారన్నారు. ఏలేరు కాలువ ఆధునికీకరణ పనుల అంశాన్ని అంబ్లీలో ప్రస్తావిస్తామని తూర్పు గోదావరి జిల్లా రైతులకు శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరుతూ పాదయాత్ర పూర్తిచేసిన ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట (తూర్పుగోదావరి) ప్రాంతాల రైతులు పెద్దసంఖ్యలో ఆదివారం మధ్యాహ్నం పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మను‌ లోటస్‌పాండ్‌లో ఆమె నివాసంలో కలిశారు. తమ నాలుగు నియోజకవర్గాలకు ఎంతో మేలు చేకూర్చే ఏలేరు ఆధునికీకరణ పనులకు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, ఆయన మరణించాక దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె దృష్టికి తెచ్చారు. ఏలేరు కాలువ ఆధునికీకరణ పనుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆమెకు వారు వినతిపత్రం సమర్పించారు. ఏలేరు కాలువ కింద 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. వైజాగ్ స్టీ‌ల్ ప్లాంటు, విశాఖకు ఏలేరు కాల్వ ద్వారా నీ‌టిని అందించాల్సి ఉంది.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. ‘రైతులకు ఆత్మాభిమానం చాలా ఎక్కువని, తినడానికి తిండి లేని రోజుల్లోనూ ఒకరి ముందు చేయిచాచే మనస్తత్వం వారిది కాదని మహానేత వైయస్ చెప్పేవారు. వారి‌ కోసం ఎంత చేసినా తక్కువేనని నాతో అనేవారు. అందుకే ముఖ్యమంత్రి కాగానే 2004లో తొలి సంతకం ద్వారా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలులోకి తెచ్చారు' అన్నారు. ఎవరూ అడగకుండానే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 2009లో ఏలేరు కాల్వ ఆధునికీకరణ పనులకు రూ.138 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. రైతులకు శాశ్వతంగా మేలు చేయాలంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే సరైన పరిష్కారమని భావించి తన ఐదేళ్ల పాలనలో రూ.51 వేల కోట్ల మేరకు జలయజ్ఞంపై ఖర్చు చేశారన్నారు. మహానేత ఉన్నప్పుడు రైతులకు ఒక భరోసా ఉండేదన్నారు. ఆ మహానేత మరణించిన తరువాత పనులు పెండింగ్‌లో పడిపోయాయని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆమె విమర్శించారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అష్టకష్టాలు పడిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో కష్టాలను తాళలేక 4 వేల మంది రైతులు ప్రాణాలో తీసుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో బాధలు పడుతున్న రైతులను ఆదుకునేందుకే వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పెండింగ్‌ పనులన్నీ పూర్తిచేస్తామని రైతులకు శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, శ్రీ జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి అందరూ సహకరించాలని పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ ప్రభుత్వ హయాంలో ఏలేరు కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఏలేరు కాల్వ ఆధునికీకరణ జరిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే శ్రీ జగన్‌ సిఎం అవుతారని, ఈ సమస్యను అప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్ళి సంవత్సరం లోగా పరిష్కారం అయ్యేలా చూస్తానని రైతులకు మైసూరారెడ్డి హామీ ఇచ్చారు.

అంతకు ముందు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఏలేరు కాల్వ ఆధునికీకరణ అంశాన్ని ఈ ప్రభత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే తూర్పు గోదావరి జిల్లా రైతులు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే తాము ఈ పాదయాత్ర చేశామన్నారు. ఏలేరు ఆధునికీకరణకు నిధులు విడుదల చేయించుకుని రైతుల కడగండ్లు తీర్చాలన్న సదుద్దేశంతో పాదయాత్రను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా ఏలేరు ఆధునికీకరణకు నిధులు తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలని శ్రీమతి విజయమ్మకు రైతుల తరఫున జ్యోతుల నెహ్రూ విజ్ఞప్తి చేశారు.
Back to Top