ఆడబిడ్డలను చూసినప్పుడు బాధగా లేదా బాబూ!

ఆత్మకూరు, (మహబూబ్‌నగర్‌ జిల్లా): 'కూలీలుగా మారి పొలం పనులు చేసుకొంటున్న ఆడబిడ్డలను చూసినప్పుడైనా ‘అయ్యో..! ఆ వేళ మాట ఇచ్చి నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్నానే.. వారి ఉసురు నాకు తగులుతుందేమో’ అని మీ మనసుకు ఒక్క సారంటే ఒక్కసారైనా కూడా అనిపించలేదా?’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబును తూర్పారపట్టారు.

 ‘చంద్రబాబు నాయుడు గారూ.. పాదయాత్ర అంటూ మీరు పల్లెల వెంట తిరుగుతున్నారు. రకరకాల హామీలు ఇస్తున్నారు. మీరు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో మీరొక వాగ్దానం చేశారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని, ఆ ఆడబిడ్డ చదివినంత వరకు ఉచితంగా చదివిస్తామని స్వయంగా మీరే మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత మంది ‌ఆడపిల్లలకు ఉచిత విద్య అందించారు? మొత్తం మీ తొమ్మిదేళ్ల పాలనలో కేవలం నాలుగంటే నాలుగు లక్షల మందికి మాత్రమే రూ.5 వేల చొప్పున మీరు డిపాజిట్ చేశారు.‌

‘మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఎలాంటి వాగ్దానం చేయకుండానే మీ కంటే గొప్పగా ఆ పథకాన్ని అమలు చేశారు. కుటుంబంలో తొలిచూరు ఆడపిల్ల జన్మిస్తే రూ.1,00,000, రెండో ఆడపిల్ల పుడితే రూ.30,000 చొప్పున డిపాజి‌ట్ చేశారు. ఆయన సువర్ణ పాలనలో మొత్తం ఐదున్నర లక్షల మంది చిన్నారుల పేరు మీద ఇలా డిపాజి‌ట్ చేశారు. నా చిట్టి తల్లులు పెరిగి పెద్దవారైతే పెళ్లీడు వచ్చే నాటికి మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నగదు చేతికి వస్తుంది’ అని షర్మిల గుర్తుచేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని‌ కాంగ్రె‌స్ ప్రభుత్వం తీరుకు, దానికి మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం 44వ రోజు అత్యంత వెనుకబడిన పాలమూరు జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ‌కొనసాగింది. శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేస్తూ ఆత్మకూరు మండల కేంద్రానికి అశేష సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ఈ ప్రభుత్వం బతికే ఉందా? చచ్చిందా?
గురువారం రాత్రి తాను పాదయాత్ర ముగించే సమయంలో పెద చెన్నయ్య అనే రైతు తన వెంట నడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడని శ్రీమతి షర్మిల చెప్పారు. ‘అక్కా.. వైయస్‌ఆర్ నాకు కన్న తండ్రి లాగా ఉన్నాడు. పోయిన ఏడాది పత్తి పంట వేశాను. అది చేతికి రాలేదు. ఇప్పుడు పత్తితో‌ పాటు వేరుశనగ కూడా వేశాను. అది కూడా వస్తుందో రాదో తెలీదు. రూ. 3 లక్షలు అప్పుల పాలయ్యాను. నాన్న ఉన్నప్పుడు నా అప్పులన్నీ తీర్చేశాడు. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదక్కా..’ అని చెప్పినప్పుడు ఒక పక్క బాధ అన్పించింది. మరోవైపు నాన్నగారు రైతుల హృదయాల్లో ఇంతలా స్థానం సంపాదించుకున్నారని సంతోషపడ్డాను. నాన్న పోయాక రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి.. లేదంటే ఉన్న భూములను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రైతుల గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వం అసలు బతికే ఉందా లేదా చచ్చిందా’’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాల మంది అక్కా చెల్లెమ్మలు తమకు తాగునీళ్లు కూడా లేవని, చేసుకోవడానికి కూలి పనులు కూడా దొరకడం లేదని, పసిపిల్లలను ఇంటి వద్దే వదిలి బతుకుదెరువు కోసం వలసలు వెళ్తున్నామని చెబుతన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి, వారి సమస్యలు తీర్చేలా చేయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అధికార పక్షంతోనే కుమ్మక్కయ్యారు అని షర్మిల టిడిపి అధినేతపై నిప్పులు చెరిగారు. ‘చంద్రబాబుకు మాట మీద నిలబడటం అంటే ఈ జన్మలో తెలీదు. తొమ్మిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టమని రైతులపై ఒత్తిడి తెచ్చాడు. కరువు వచ్చింది.. తినటానికే తిండి గింజలు లేవు.. ఇప్పుడు బిల్లులు కట్టలేం మహాప్రభో అని రైతులు మొరపెట్టుకున్నా చంద్రబాబు వినలేదు. అప్పుడు రాజన్న ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన పదవి ఉన్నా లేకపోయినా రైతులకు అండగా నిలబడ్డారు. అదే బాబు రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని వారింట్లో సామాను లాక్కున్నారు. కేసులు పెట్టించారు. ఇంట్లో మగవారు లేకపోతే ఆడవారు అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. బకాయిలు కట్టలేక, అవమానం తట్టుకోలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పాపం బాబుది కాదా?’ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. చంద్రబాబుకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించేయమని మేం పదేపదే చెబుతున్నా ఆయన అవిశ్వాసం పెట్టనంటే పెట్టనంటున్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయన అవిశ్వాసం పెట్టనంటున్నారు’ అని శ్రీమతి షర్మిల విమర్శించారు.

అల్లిపురంలో ఆత్మీయ స్వాగతం:
శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రాత్రి ఆత్మకూరు మీదుగా అల్లిపురంవైపు సాగింది. అక్కడ కొందరు ఆమె యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేశారు. విషయం గ్రామంలో వ్యాపించడంతో ప్రతి ఇంటి నుంచీ మహిళలు బయటికి వచ్చారు. శ్రీమతి షర్మిలకు అండగా నిలబడ్డారు. ఆమెకు హారతి పట్టి ఆహ్వానించారు. రైతులు కూడా అండగా కదలిరావడంతో అల్లిపురం చౌరస్తా జనంతో కిటకిటలాడింది. అండగా వచ్చిన జనాన్ని చూసిన ఆ ఆందోళనకారులు తమ యత్నం విరమించుకున్నారు. మహిళలు తోడు ఉండి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస వరకు షర్మిలను సాగనంపారు. శుక్రవారం ఉదయం మూలమల్ల శివారు నుంచి మొదలైన పాదయాయాత్ర ఆత్మకూరు మీదుగా రాత్రి 8 గంటలకు అల్లిపురం చేరింది. శుక్రవారం మొత్తం 17 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు. ఇప్పటివరకు మొత్తంగా 606 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.
Back to Top