75 శాతం రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి

గుడివాడ, (కృష్ణాజిల్లా): రైతులు, కౌలు రైతులకు కనీసం 75 శాతం మందికి రెండో పంటకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందజేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎ‌స్.నాగిరెడ్డి, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యు‌రాలు ఉప్పులేటి కల్పన‌ డిమాండ్ చేశారు. శనివారంనాడు గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తుపాను కారణంగా పైర్లు దెబ్బతిన్నాయని, దీనితో రైతులు పెట్టిన ఖర్చులు కూడా మిగలే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కో మండలానికి సరఫరా చేస్తున్న సబ్సిడీ విత్తనాలు కనీసం ఒక్క గ్రామానికి కూడా సరిపోవని వారు వ్యాఖ్యానించారు.

ఒక్క సహకార సంఘానికి కూడా ఇంతవరకూ సబ్సిడీ విత్తనాలు అందలేదని నాగిరెడ్డి, కల్పన విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా వరికోతలు ప్రారంభించగా రెండో పంటకు విత్తనాలు అందచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కౌలురైతులకే సబ్సిడీ విత్తనాలు నేరుగా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంద శ్రీనివాసరెడ్డి, పామర్రు కన్వీనర్ అబ్దుల్ ముబీ‌న్‌ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 
Back to Top