రెండవ రోజూ రహదారుల దిగ్బంధం


హైదరాబాద్, 7 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న ప్రజల ఆకాంక్షను కేంద్రానికి స్పష్టం చేసేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపుతో చేపట్టిన రహదారుల దిగ్బంధం రెండవ రోజు గురువారం కూడా కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు రహదారుల దిగ్బంధంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల ఒత్తిళ్లు, అరెస్టులకు తలొగ్గకుండా నాయకులు రహదారులను దిగ్బంధిచిన బెజవాడ వాసులు గురువారం కూడా కదం తొక్కారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదవ నంబర్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం వద్ద భైఠాయించారు. దీ‌నితో హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫి‌క్ జాం అయింది. విద్యార్థులు, మహిళలు కూడా స్వచ్ఛందంగా రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం క్రిష్టవరం టోల్‌ ప్లాజా వద్ద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.‌ జిల్లాలోని దిండి-చించినాడ బ్రిడ్జిపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ 216ను వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దిగ్బంధించారు. దానితో వాహనాలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా నగరంలోని ఓఎన్జీసీ రిఫైనరీ ఎదుట ‌పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, వేణుగోపాలరావు, మందపాటి కిర‌ణ్‌కుమార్ ఆధ్వర్యంలో‌ రహదారి దిగ్బంధం చేశారు. ముమ్మడివరంలో గుత్తుల సాయి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధంతో ట్రాఫిక్ స్తంభించి‌పోయింది.

Back to Top