2జీని మించిన కేజీ బేసిన్ స్కామ్!


గుంతకల్లు

7 నవంబర్ 2012 : రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసి కేజీ బేసిన్ గ్యాస్‌ను చంద్రబాబు రిలయన్స్‌కు కట్టబెట్టారని షర్మిల విమర్శించారు. దానికి ప్రతిఫలంగా రిలయన్స్ 'ఈనాడు' సంస్థలో పెట్టుబడులు పెట్టించిందని ఆమె ఆరోపించారు. కేజీ బేసిన్ గ్యాస్ మనకు దక్కి ఉంటే ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేదని ఆమె అన్నారు. ఇది అన్యాయమంటూ ఆనాడు వైయస్ గగ్గోలు పెట్టినా, ప్రధానమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదని ఆమె గుర్తు చేశారు. నిజానికి కేజీ బేసిన్ స్కాం 2జీ కుంభకోణాన్ని మించినదన్నారు. 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు అజంతా సర్కిల్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. చంద్రబాబు-రిలయన్స్-ఈనాడు కూటమి పరస్పర లబ్ధి వైనాన్ని షర్మిల తన ప్రసంగంలో ఎండగట్టారు.
షర్మిల మాటల్లోనే...
"కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు మనకు దేవుడిచ్చిన వరం. అక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను విద్యుత్తు అవసరాలకు వాడుకోగా కూడా ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేయవచ్చు. కానీ చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిని తీసుకుపోయి రిలయన్స్‌కు కట్టబెట్టారు. ఇప్పుడు మనకి ఏమీ రాదు. ఇది అన్యాయం. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ మన ప్రజల అవసరాలకు కావాలి అని రాజశేఖర్ రెడ్డిగారు ఎన్ని సార్లు గగ్గోలు పెట్టినా, ఎన్ని సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాసినా వాళ్లు పట్టించుకోలేదు. ఆ పాపం చంద్రబాబు నాయుడుగారిదే.  కేవలం స్వార్థం కోసం రిలయన్స్‌కు మేలు చేయాలని, ఆయనకు కావాల్సినవారికి మేలు జరగాలని రిలయన్స్‌కు కేజీ బేసిన్ అప్పగించి వాళ్ల ద్వారా 'ఈనాడు' లో ఒక్కో షేరు ఐదున్నర లక్షల రూపాయలకు చొప్పున పెట్టుబడులు పెట్టించారు. చంద్రబాబునాయుడు మన రాష్ట్ర ప్రజలకు ఈ ద్రోహం చేశాడు. ఇది అంతా ఇంతా కుట్ర కాదండీ! 2జీ స్కామ్‌ కంటే పెద్ద స్కాం ఇది. కాగ్‌లాంటి సంస్థలు కూడా ఎంతో చెపుతున్నాయి. కానీ దాని మీద విచారణ చేయరట. కమ్యూనిస్టువాళ్లు రెండెకరాల చంద్రబాబుకు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయంటే దాని మీద కూడా విచారణ చేయరట!  దేశంలో చంద్రబాబుకు మించిన ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడని తెహల్కా డాట్ కామ్  చెప్పినా విచారణ చేయరట. ఐఎంజి కేసులో కోర్టు ఈయన మీద విచారణ జరపాలన్నా విచారణ జరపరట. ఎమ్మార్ కేసులో చంద్రబాబు తన భార్య స్థలాన్ని కోటి రూపాయల కంటే ఎక్కువకు అమ్మేసి దాని పక్కనే ఉన్న 850 ఎకరాల ప్రభుత్వభూమిని మాత్రం ఎకరా రూ. 26 లక్షలకే అమ్మేశాడు. కానీ దాని మీదా ఎంక్వైరీ చేయరట. చీకట్లోనే చిదంబరాన్ని కలుస్తారు. గొప్పగా మ్యానేజ్ చేసుకుంటారు." అని షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వైయస్ చెప్పింది చేశారు...
రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఏడు గంటల కరెంటు ఇస్తానని చెప్పి ఇచ్చి చూపించారనీ,  కరెంటు చార్జీలను, ఆర్టీసీ చార్జీలను పెంచనే లేదనీ షర్మిల గుర్తు చేశారు. నీటి బిల్లుల నుండి గ్యాస్ ధర వరకూ దేనినీ  పెంచని ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగారేనని ఆమె అన్నారు.
"గ్యాస్ గురించి ఈ రోజు మాతో ఒక మహిళ చాలా చక్కగా చెప్పింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు సిలిండర్ ధర రూ. 145. ఆయన దిగిపోయేసరికి దాని ధర రూ.305. పెంచుకుంటూ పెంచుకుంటూ పోయాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యే సరికి గ్యాస్ ధర రూ. 305. ఆయన ఒక్క రూపాయి కూడా పెరగనివ్వలేదు. ఆయన పోయేప్పటికి కూడా గ్యాస్ ధర రూ.305 మాత్రమే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది? గ్యాస్ కొనాలంటే 485 రూపాయలు వెచ్చించాలి. అదీ ఆరు సిలిండర్లే ఇస్తారట. మిగతా వాటికి వెయ్యి  రూపాయలు పెట్టి కొనాలట. సగటున ఒక కుటుంబానికి నెలకు ఒక గ్యాస్ సిలిండర్ అవసరమైతే రూ.750 ఖర్చుఅవుతుంది."అని షర్మిల విమర్శించారు.
ఈ ప్రభుత్వం రైతులనైతే పూర్తిగా విస్మరించిందనీ, అన్నంపెట్టే అన్నదాతను కడుపుపై కొట్టి కన్నీళ్లు పెట్టిస్తోందనీ ఆమె నిందించారు. "ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ లేదు. నాలుగింతలు పెంచేశారు. పంటల బీమాను మండలం యూనిట్‌గా తీసుకుంటున్నారు. దానిని గ్రామం ప్రాతిపదికన తీసుకోవాలని రైతన్నలు మొత్తకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదు. ఇన్స్యూరెన్సు రూపంలో రైతన్నలను ఎడాపెడా కొడుతోంది ఈ ప్రభుత్వం. ఈ పాపం ఊరకే పోదు" అని షర్మిల వ్యాఖ్యానించారు. నిలదీయాల్సిన ప్రధానప్రతిపక్షం మూడేళ్లుగా చోద్యం చూస్తోందనీ, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందనీ ఆమె విమర్శించారు.
ఇప్పుడు బిల్లులు కట్టొద్దంటున్నాడు!
వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన బాబు రెండు రూపాయల కిలోబియ్యం, మద్యనిషేధం అన్న ఎన్టీఆర్ రెండు వాగ్దానాలను తుంగలో తొక్కారనీ, ప్రాజెక్టులు, వ్యవసాయం గిట్టుబాటు కానివని చంద్రబాబు నాయుడు 'మనసులో మాట' పుస్తకంలో రాసుకున్నారు కూడాననీ ఆమె గుర్తు చేశారు.
"చంద్రబాబు దేన్నీ ప్రజలకు ఉచితంగా ఇవ్వరాదన్నారు. ఎనిమిదిసార్లు కరెంటు చార్దీలు పెంచి ఒత్తిడి తెచ్చి, రైతులను జైళ్లలోనూ పెట్టారు. ఆందోళన చేస్తే బషీర్‌బాగ్‌లో కాల్పులూ జరిగాయి. నాలుగువేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల సంఖ్యలో చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా వేల మందిని చంద్రబాబు పొట్టనబెట్టుకున్నారు. ఇది మరచిపోలేని విషయం." అని షర్మిల అన్నారు.
బిల్లులు కట్టొద్దండీ అని ఇప్పుడంటున్న చంద్రబాబు ఆనాడు ఇవే బిల్లుల కోసం వెంటాడి వేధించాడని ఆమె దుయ్యబట్టారు. తన ప్రభుత్వ విధానాలను అమలు చేస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదనీ, అన్నీ రాజశేఖర్ రెడ్డిగారి పథకాలనే అమలు చేస్తామంటున్నాడనీ ఆమె ఎగతాళి చేశారు. 12 వేల కోట్ల రుణమాఫీ, ఫీ రి ఇంబర్స్‌మెంటు, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అమలు చేస్తాడట. ఒక ఎలక్షన్లో చెప్పింది ఇంకో ఎలక్షన్లలో గుర్తుండదు చంద్రబాబునాయుడిగారికి. విశ్వసనీయత అంటే ఏమిటని అడుగుతున్నారు. మడమ తిప్పకపోవడమే విశ్వసనీయత...అని షర్మిల అన్నారు.
పాదయాత్ర చేయాల్సి అగత్యం లేదు చంద్రబాబుకు లేదనీ, అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని దించేయవచ్చు కదా అని ఎన్నిసార్లు అడిగినా ఆయన పలకరని ఆమె ఎత్తిపొడిచారు.
కుమ్మక్కు రాజకీయాలు...
"చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఒక్కటి కానే కూడదు. కానీ వీళ్లు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు సాగిస్తున్నారు. సిబిఐని వాడుకుని విచారణ పేరుతో జగన్‌ను బెయిలు కూడా రాకుండా జైలులో పెట్టారు. ఇంత నీచమైన కుట్ర పూరిత రాజకీయాలు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. కానీ దేవుడున్నాడు. దేవుడే జగనన్నను బయటకు తెస్తాడు. జగనన్న వస్తాడు. 'రాజన్న రాజ్యం' స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఆ రోజున రాజన్న ప్రతి కలనూ జగనన్న నెరవేరుస్తాడు. కోటి ఎకరాలకు నీరు, గుడిసె లేని రాష్ట్రం వంటి రాజన్న కలలు నెరవేరతాయి. జగనన్నను ముఖ్యమంత్రి అయిన రోజు రాజన్న సువర్ణయుగం వస్తుంది." అని ఆమె భరోసా ఇచ్చారు.
తన పాదయాత్రను ఇన్నాళ్లుగా విశేషంగా ఆదరిస్తూ వచ్చిన అనంతపురం జిల్లావాసులకు కృతజ్ఞతలు ఆమె తెలిపారు.
షర్మిల ప్రసంగానంతరం డి.వేణుగోపాల్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి  రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన తర్వాత జరిగిన అన్యాయాలపై  తాను రాసిన లేఖ చదివి వినిపించాడు. ఇదిలావుండగా బుధవారం షర్మిల తన 21వ రోజు పాదయాత్రలో 10 కిలోమీటర్లు నడిచారు. 22 వ రోజు పాదయాత్ర గురువారం(నవంబర్ 8న) కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది. పత్తికొండ నియోజకవర్గం మద్దికర వద్ద ఆమె కర్నూలుజిల్లాలో ప్రవేశిస్తారు. గురువారం 12.5 కి.మీల మేరకు పాదయాత్ర సాగుతుంది.

Back to Top