నా ప్రశ్నలకు సమాధానం తిరుపతి సభలోనైనా.. చెప్తారా



 
29–04–2018, ఆదివారం
పామర్రు, కృష్ణా జిల్లా


ఖండాంతరాలలో ఖ్యాతిగాంచి, విశ్వవేదికల మీద ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలను ఆవిష్కరించిన సనాతన భారతీయ నాట్యకళ ‘కూచిపూడి’ ఆవిర్భవించిన ప్రాంతం.. ఈ పామర్రు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అడుగిడగానే.. ఇక్కడికి సమీపంలోని నిమ్మకూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి.. స్వశక్తితో ఎదిగి.. తెలుగు సినీ రంగంలో ఉజ్వలంగా వెలుగొంది.. రాజకీయ పార్టీని స్థాపించి.. అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి.. జీవిత చరమాంకంలో తీవ్ర మానసిక క్షోభకు గురై అశువులుబాసిన ఎన్టీ రామారావుగారి స్మృతులు మదిలో మెదిలాయి.

తోట్లవల్లూరుకు చెందిన యార్లగడ్డ శివయ్య అనే రైతు మంటాడ వద్ద నన్ను కలిసి ‘అన్నా.. మా గ్రామ శివారు కృష్ణా నదిలో అక్రమంగా 30 అడుగుల మేర లోతుగా తవ్వేస్తూ.. ఇసుకను, దాంతో పాటు సారవంతమైన మట్టిని తరలించేస్తున్నారు. అంత లోతుగా తవ్వడంతో భూగర్భ జలాలు ఇంకిపోయి, బోర్లు అడుగంటిపోయి పచ్చని పంటపొలాలు బీళ్లుగా మారిపోతున్నాయి. నేను కిందామీదా పడి.. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి మూడు బోర్లు వేస్తే.. అక్రమ తవ్వకాల దెబ్బకు మూడు బోర్లూ వట్టిపోయాయి. పంటలు దెబ్బతిని అప్పులపాలయ్యాను. ఆ ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటు కూడా వచ్చింది. ముఖ్యమంత్రిగారి కనుసన్నల్లోనే ఇసుక, మట్టి మాఫియాలు చెలరేగిపోయి.. విచ్చలవిడిగా తవ్వేస్తుంటే.. ఎక్కడ మొరపెట్టుకోవాలో తెలియక మీ దగ్గరకు వచ్చానంటూ’’ ఆ అన్న చెబుతుంటే.. రైతుల పొట్టగొట్టి అక్రమ సంపాదనతో బలిసిపోతున్న వారి పాపంపండే రోజుల కోసం ప్రజలెంతగా ఎదురుచూస్తున్నారో అవగతమవుతోంది.


మంటాడ గ్రామంలో ముంగా రాములమ్మ అనే అవ్వ దీనస్థితిని చూసి చాలా బాధేసింది. నాలుగు రోజుల కిందట గుడిసె కా>లిపోయి ఓ పాదమంతా.. చూడగానే ఒళ్లు జలదరించిపోయేలా కమిలిపోయింది. నన్ను చూడగానే భోరున ఏడ్చింది. ‘అయిదేళ్ల కిందట భర్త చనిపోయాడు.. పిల్లల్లేరు.. నిన్నటిదాకా తలదాచుకున్న గుడిసె కాలిపోయింది. దాంతోపాటు సర్వమూ బూడిదైంది. ఇంతవరకూ కనికరించిన నాయకుడే లేడు. అయిదేళ్లయినా వితంతు పింఛన్‌ రావడం లేదు. పక్క గుడిసె వారి దయాదాక్షిణ్యాలతో ఇంత ముద్ద మింగుతున్నాను నాయనా. నాకు పింఛన్‌ రాదా.. ఇల్లు కాలిపోయినందుకు పరిహారం ఇవ్వరా..’ అంటూ ఆ అవ్వ ఆక్రోశిస్తుంటే.. ఇలాంటి అభాగ్యులకు సైతం సాయం చేయలేని ప్రభుత్వం, చేయూతనందివ్వలేని పాలన ఎందుకు.. అనిపించింది.

నాన్నగారి మీదున్న అపార గౌరవం.. ఆ తరహా పాలనను నేను అందివ్వగలనన్న నమ్మకంతో కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్న వందలాది మంది అనుచరులతో వచ్చి పార్టీలో చేరారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఏప్రిల్‌ 30న వెంకన్న సాక్షిగా తిరుపతిలో సభ పెట్టిమరీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చాయి నేటి పాలక పార్టీలు. పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తెస్తాను.. అంటూ ఆర్భాటం చేశారు చంద్రబాబుగారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను భూస్థాపితం చేస్తూ.. హోదాకు వెన్నుపోట్లు పొడుస్తూ నాలుగేళ్లకాలం వెళ్లదీసిన చంద్రబాబు.. నేడు ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస సంకోచం కూడా లేకుండా ధర్మపోరాట సభ అంటూ కొత్త నాటకానికి తెరలేపడం దిగజారుడుతనానికి పరాకాష్ట. అందుకు నిరసనగానే.. రాష్ట్ర ప్రజలను ఎలా వంచించారో అర్థం కావాలనే.. వైఎస్సార్‌సీపీ విశాఖలో వంచన వ్యతిరేక దినం పాటిస్తోంది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ.. పలుమార్లు హోదా విషయమై మిమ్మల్ని  ఏడెనిమిది ప్రశ్నలు సూటిగా అడిగాను. ఇప్పటి వరకూ మీ నుంచి సమాధానం రాలేదు. ధర్మపోరాటమని మీరు చెప్పుకొంటూ తిరుపతిలో నిర్వహిస్తున్న సభలోనైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పే నిజాయితీ, ధైర్యం మీకున్నాయా?
- వైయ‌స్‌ జగన్‌






Back to Top