1127 కిలోమీటర్లు పూర్తయిన షర్మిల పాదయాత్ర

సత్తెనపల్లి (గుంటూరు జిల్లా), 4 మార్చి 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 81వ రోజు పాదయాత్ర సత్తెనపల్లిలోని వెంకటపతి నగర్‌లో ముగిసింది. సోమవారం సాయంత్రం వరకు ఆమె మొత్తం 1127 కిలో మీటర్లు పాదయాత్రగా నడిచారు. అంతకు ముందు శ్రీమతి షర్మిల సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్‌ ధర్నాలు పాల్గొని హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. విద్యుత్‌ సరఫరాలో భారీగా కోతలు విధించడమే కాకుండా విద్యుత్‌ ధరలు పెంచేసిన ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు తీరుపైనా ఆమె నిప్పులు చెరిగారు.

ధర్నాలో ప్రసంగించిన అనంతరం శ్రీమతి షర్మిల తన పాదయాత్రను మరి కొంత దూరం కొనసాగించి వెంకటపతినగర్‌లో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకున్నారు.
Back to Top