ఇలాగైతే పోలవరం ఇప్పట్లో పూర్తవ్వదు

హైదరాబాద్: బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే.. ఇక పోలవరం ప్రాజెక్టు రానట్లేన ని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు అభిప్రాయపడ్డారు. పోలవరానికి వంద కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారని ఈ రకంగా కేటాయింపులుంటే ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదన్నారు. బహుశా ఈ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ముందే ఒక అవగాహనతో ఉన్నాయేమోననే అనుమానాన్ని సోమయాజులు వ్యక్తం చేశారు. పోలవరానికి బీజేపీ వారు ఎలాగూ నిధులు ఇవ్వరనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా ఉందని చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు.

జాతీయ హోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,000 కోట్లు ఖర్చవుతాయని, మూడేళ్లలో దీనిని పూర్తి చేస్తామని చెప్పినందున ప్రతి ఏటా కనీసం రూ.6,000 కోట్లు కేటాయించాల్సి ఉందని సోమయాజులు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే వాస్తవిక వ్యయాన్ని ఇస్తామని కూడా కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీకి సంబంధించి ముఖ్యమైన రాజధాని నిర్మాణానికి నిధులేమీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తాము కేటాయింపులేమీ చేయకపోయినా విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మాత్రం ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారనీ, అయితే అదెప్పుడూ చెప్పేమాటేనని అన్నారు.

గతంలో కూడా తాము బడ్జెట్ పెట్టిన వెంటనే వెళ్లి అడిగితే.. బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా ఏపీకి ఏదో రకంగా నిధులు ఇస్తామన్నారని, ఆ తరువాత అవి కార్యరూపం దాల్చలేదని సోమయాజులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి వచ్చే స్థూల పన్నుల రాబడి లో వాటా, ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘాల నుంచి వచ్చే గ్రాంట్లు.. మొత్తం కలిపి 62 శాతం వరకు రాష్ట్రాలకు తొలిసారిగా ఇప్పుడే బదిలీ అవుతున్నట్లు ఆర్థికమంత్రి చెప్పడం ఎంతమాత్రం సరికాదని సోమయాజులు అన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రాలకు ఎప్పుడూ 68 నుంచి 71 శాతం వరకు ఆ వాటా ఎప్పుడూ వస్తూనే ఉందని అందులో కొత్తేమీ లేదని వివరించారు.

ఏమాత్రం ఆశాజనకంగా లేదు..:  జైట్లీ ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. పది నెలల కోసం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం రూ.17.94 లక్షల కోట్లుగా ఉందని, అదిప్పుడు తగ్గి రూ.17.77 లక్షల కోట్లకు చేరుకుందని.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇదెంత మాత్రం మంచి సంకేతం కాదన్నారు. మన ఆర్థికాభివృద్ధిరేటు 8 శాతానికి వెళ్లబోతోందని, ప్రపంచమంతా మనవైపే చూస్తోందనే ఆర్భాటపు మాటలు చెప్పుకోవడం తప్పితే.. ఆచరణలో అదేమీ లేదని బడ్జెట్ లెక్కలను లోతుగా పరిశీలిస్తే అర్థం అవుతోందన్నారు. బడ్జెట్ పరిమాణం తగ్గడం, ప్రణాళికా వ్యయం గత ఆర్థిక సంవత్సరం కన్నా తగ్గి పోవడం ఆర్థికాభివృద్ధి పెరుగుదలకు సంకేతం కాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మన ఆర్థిక విషయాలను బహిరంగ పర్చకపోవడం సరికాదని సోమయాజులు అన్నారు. ఆర్థిక వివరాలు కావాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాస్తే.. ఆ వివరాలు అడగడానికి జగన్ స్థాయి చాలదనడం, ప్రతిపక్ష నాయకుడికి హోదా లేదని రాష్ట్ర మంత్రి యనమల మాట్లాడ్డం శోచనీయమని చెప్పారు. మన రాష్ట్రం లోటు ఎంత ఉందో, గత ఏడాదిగా నెలకొన్న ఆర్థిక పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి వివరాలు బహిరంగపరిస్తే కేంద్రం నుంచి మనకేమి రావాలో, కావాలో అడిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Back to Top