చంద్ర‌బాబు బీసీల‌ను అణ‌గ‌దొక్కుతున్నారు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి  

శ్రీకాకుళం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను అణగదొక్కుతునే వస్తున్నారని, న్యాయమూర్తి పదవులకు బీసీలు పనికిరారని కేంద్రానికి నివేదిక పంపించిన ఈ పెద్దమనిషి.. ఎన్నికలు రెండు నెలల్లో వస్తున్నాయనేసరికి  బీసీలపై కపట ప్రేమను వలకబోస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు  ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేతకాని చంద్రబాబుకు ఎన్నికల్లో గెలిపిస్తే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

అమరావతి సచివాలయం సాక్షిగా నాయీబ్రాహ్మణలకు తోకలు కత్తిరిస్తాం.. తాట తీస్తామని బెదిరించి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బదీసిన నాయకుడిని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. విభజన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో బీసీలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు బీసీ గర్జన సమావేశంలో పలు అంశాలపై ప్రకటన చేయనున్నారని పేర్కొన్నారు.
 

Back to Top