చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కుప్పం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ లలితా మురుగేశ్, నాయకులు భాస్కర్ నాయక్, చెంగప్ప మీడియాతో మాట్లాడారు. దళితులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులనే అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించడం దురదృష్టకరమని వారు విమర్శించారు. శాంతిపురం మండలంలోని నంజంపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవ పెద్ద వివాదంగా మారి, దళిత కుటుంబంపై అగ్రకులాలకు చెందిన కొందరు మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై ఇలాంటి దాడులు అసలు సమంజసం కాదని, చట్టపరంగా అందరికీ సమాన రక్షణ కల్పించాలని అన్నారు. కుప్పంలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ కాకుండా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని వారు కోరారు. అలాగే, దళితులకు న్యాయం చేయాలని అడిగిన రామకుప్పం మండలానికి చెందిన మురుగేష్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.