వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకి అప్పగింత

ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు

కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్‌ తరుపు న్యాయవాది

ఎన్ఐఏ ద‌ర్యాప్తులో నిజాలు వెలుగులోకి వ‌స్తాయి:  మిథున్‌రెడ్డి

అమరావతి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  వైయ‌స్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. 

ఎన్‌ఐఏ యాక్ట్‌ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైయ‌స్‌ జగన్‌ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు  తీర్పు ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..ఏపీ హైకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని, న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్ఐఏ ద‌ర్యాప్తులో నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు. ఇందులో ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని, అందుకే ఇన్నాళ్లు ఏపీ ప్ర‌భుత్వం కేసును ఎన్ఐఏకు అప్ప‌గించ‌కుండా అడ్డుకుంద‌న్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌న్నారు.

Back to Top