తీర్చలేని రుణం

ఎపి ట్రాన్స్ కో జెన్ కో అధికారులు చంద్రబాబుని కలిసారు. సార్ సంస్థ అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రైవేటు విద్యుత్ కొని, ప్రభుత్వ సంస్థలను మూలన పడేలా చేసారు మీరు. ఇప్పుడు వాటినించి బైటపడాలి అడిగారు అధికారులు. 
ఓ క్షణం అలోచించి ఇలా చెప్పాడు బాబు - ఓ పని చేయండి దామోదరం సంజీవయ్యా ధర్మల్ విద్యుత్ ప్లాంటు ఉంది కదా…దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పుతెచ్చుకుని పని జరుపుకోండి.
సరే అని వెనుదిరిగారు అధికారులు.
అదేంటి ప్రభుత్వ ఆస్తులు బ్యాంకుల్లో పెట్టి అప్పులు తీసుకుంటే మళ్లీ తీర్చేటప్పుడు భారం కాదా…అడిగాడు ఓ కుర్ర అధికారి సీనియర్ ని. అప్పులు పుట్టించడం గురించి చెప్పారు గానీ తీర్చడం గురించి మనకు సంబంధం ఉందని ఆయన చెప్పలేదు కదా…చంద్రబాబు సంగతి తెలిసిన అనుభవజ్ఞడైన ఆ పెద్దాయన బదులిచ్చాడు.
మరి కాసేపటికి జలవనరుల శాఖ కార్యదర్శి వచ్చారు. సిఎమ్ గారితో భేటీ అయ్యారు. సార్ మీ అండదండలతో వెయ్యికోట్లు ఇప్పటికే అప్పు పుట్టించేశాం. నీళ్లు-మొక్కలు, పంపులు – చెంబులు పథకానికి సంబంధించి ఇంకా 5వేల కోట్లు కావాలి. ఏం చేయమంటారు అడిగాడు వినయంగా…
ముందు నీళ్లు మొక్కలకు మొదటిదశలో 1000 కోట్లు ఎలా అయ్యిందో లెక్కచెప్పు గయ్యి మన్నాడు. బాబు. అదేంటి సార్ మీరు పోలవరం నుంచి, ప్రత్యేక నిధుల దాకా దేనికీ కేంద్రానికి లెక్కలు పంపిచరు గానీ, మమ్మల్ని మాత్రం రూపీ టూ రూపీ లెక్కలడిగితే ఎలా సర్. అసలు మొన్న జరిగిన నీళ్లకుగంట, వాటర్ కి అగరబత్తీ కార్యక్రమాలకే 100కోట్లు అయ్యాయి కదా. మీకు తెలుసు కదా అన్నాడు.
సరే సరే ఏదో ఏడవండి అన్నాడు బాబు చికాగ్గా. 
మరి మా శాఖకు కావాల్సిన మొత్తం…నసిగాడు కార్యదర్శి.
బాబు మళ్లీ బుర్ర కు పదునుపెట్టాడు.  మొన్నామధ్య కట్టిన ఒట్టిసీమ ఉంది కదా దాన్ని బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చి పని గడిపేయండి చెప్పాడు. 
ఆ మాటకోసమే ఎదురు చూస్తున్న అధికారి చిత్తం అనుకుంటూ వెళ్లిపోయాడు. 
అలా ఆయన బయటకు వెళ్లగానే ఇలా వ్యవసాయ శాఖామంత్రి దిగబడ్డాడు. 
ఏమండి అందరికీ అన్నీ తాకట్టు పెట్టుకోమని చెబుతున్నారు. మరి నా సంగతేంటి. నేనేం తాకట్టు పెట్టుకోవాలి. అసలే అంతంతమాత్రం ఈ శాఖ అని విసుక్కున్నాడు. 
ఉండవయ్యా నీ గోల. అయినా నీ శాఖలో పెద్ద ఖర్చులేం ఉన్నాయి. అసలెలాంటి పథకాలూ, ఖర్చులు చేయని శాఖ కదా నీది. రైతులకు పంట రుణాలకు బ్యాంకుకు హామీ ఇవ్వక్కర్లేదు, మద్దతు ధర ఇవ్వట్లేదు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారాలూ ఇవ్వట్లేదు ఇంకేటయ్యా మీకు ఖర్చులు అడిగాడు బాబు. 
అందేంటి సర్ రాజధాని రైతులందరినీ సింగపూరు తీసుకెళ్తున్నాం కదా…వాళ్లని చూసి రాష్ట్రంలోని మిగతా రైతులు కూడా మమ్మల్నీ సింగపూరో, సిరియానో పంపమని అడుగుతున్నారు. ఎలాగూ వ్యవసాయం పండగకాదు దండగని మన ప్రభుత్వం తేల్చేసింది కనుక, సాగు లేక, అప్పుల దిగులుతో ఆత్మహత్యలు చేసుకోవాలనిపిస్తోంది…కనీసం దేశాలైనా తిప్పమని అడుగుతున్నారు. వీలైతే మన ప్రభుత్వం దిగిపోయే వరకూ రైతులందరినీ విదేశీ టూర్లలోనే ఉంచమని, ఎన్నికల సమయానికి తిరిగి రాష్ట్రానికి తీసుకురమ్మని రైతుల సంఘాల వాళ్లు గొడవ చేస్తున్నారు. ఏకబిగిన చెప్పాడు మంత్రి. 
చంద్రబాబు ఇంకాస్త గట్టిగా ఆలోచించాడు. ఇదేదో బానే ఉంది. రైతులందరికీ అభివృద్ధి అంటే ఏంటో చూపించొచ్చు. అనుకున్నాడు. ఒకె ఒకె అయితే ఓ పని చేయండి రైతుల భూములన్నీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేయండి. వాటితో మీ ఖర్చులు నడిపించేయండి అన్నాడు. 
రైతులు ఒప్పుకోరు కద సార్ అన్నాడు మంత్రి ఆందోళనగా…
చంద్రబాబు తన మార్కు దుష్టనవ్వు ఒకటి నవ్వాడు. 
మంత్రికి భయం వేసింది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు తరుచు ఇలాగే క్రూరమైన నవ్వొకొటి నవ్వుతున్నాడు. ఒకప్పుడు వైస్రాయ్ బాగోతం నడిపినప్పుడు, ఎన్టీఆర్ పై చెప్పులు విసిరినప్పుడు నవ్విన నవ్వది. 
అలా నవ్వకండి సర్ భయమేస్తుంది బిక్కచచ్చిపోతూ అన్నాడు మంత్రి. 
ఏముందయ్యా ఓ జీవో ఈ రాత్రికే రెడీ చేస్తాగా అదే క్రూరమైన నవ్వు కంటిన్యూ చేస్తూ చెప్పాడు బాబు.
చేతులెత్తి దండం పెట్టి వెళ్లిపోయాడా మంత్రి. 
వెనువెంటనే తలుపులు తోసుకుంటూ విద్యాశాఖ అధికారులు ఐదారుగురు బిలబిల మంటూ వచ్చేసారు. 
ఏంటయ్యా ఏం కొంప మునిగిపోయిందని తలుపులు బద్దలు కొట్టుకు వస్తున్నారు అడిగాడు చంద్రబాబు.
మీరేమో అంతా ప్రైవేటు పరం చేసారు. గవర్నమెంట్ బళ్లలో పాఠాలు చెప్పటానికి పంతుళ్లు లేరు. కూర్చోడానికి బెంచీల్లేవు…సమస్యలు ఏకరువు పెడుతున్నారు అధికారులు.
అయితే ఆ కారణం చెప్పి స్కూళ్లు మూసేయండి సులువుగా తేల్చేసాడు చంద్రబాబు. 
అలా కాదు సార్. స్కూళ్లు, స్టూడెంట్లు, టీచర్లు, బ్లాక్ బోర్డులు ఏం లేకపోయినా ఖర్చులు మాత్రం ఉంటాయి కద సర్. మరి వాటికోసం నిధులు అసలు విషయం చెప్పారు అధికారులు. 
దాందేవుంది స్కూలు బిళ్లింగులు కుదువ పెట్టండి. చాలకపోతే విద్యార్థుల పుస్తకాలు, బ్యాగ్గులు కలిపి టోకుగా వేలంలో అమ్మేయండి.- ప్రాబ్లం సాల్వ్ అన్నాడు బాబు. 
అధికారులు ఆనందంగా వెళ్లిపోయారు. 
ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పిఎ ఆనందంతో కళ్లనీళ్లు తుడుచుకున్నాడు. 
రాష్ట్రం కోసం ఇంత ఇదిగా ఉన్న సిఎమ్ ని మిమ్మల్నే చూస్తున్నా సార్. మీకిలాంటి తెలివితేటలు ఎక్కడినుంచి వచ్చాయి సర్. నిధుల సమీకరణ ఎలా అని చెప్పడానికి అనవసరంగా కన్సల్టెట్లను నియమించి కోట్లు వాళ్లకి కట్టబెడుతున్నాం. అదే మీరు చిటికెలో సొల్యూషన్ చెప్పేస్తున్నారు అన్నాడు ఆవేశంగా.
చంద్రబాబు మళ్లీ నవ్వాడు నర్మగర్భంగా…
పి.ఎ ఒక మాటవిను…కర్త, కర్మ, క్రియ మాత్రమే కాదు కన్సల్టెన్సీ కూడా మనమే…బాబోపదేశం చేసాడు…
అప్పులు పుట్టించేదీ నేనే…ఆ అప్పులకు ఆంధ్రాని దివాలా తీయించేదీ నేనే…
ఇది ఓటేసిన రాష్ట్ర ప్రజలకూ నాకూ మధ్య తీర్చలేని రుణానుబంధం. 
పి.ఎ కి జ్ఞానోదయం అయ్యింది. 
 

Back to Top