పచ్చటి కొమ్మలు

చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే మీడియానే కాదు, బాబు కోసమే పనిచేసే ప్యాకేజీ పార్టీలు, సీజనల్ నాయకులు కూడా ఉన్నారు. చంద్రబాబుకు కష్టకాలంలో, అవసర సమయాల్లో వారు ఆదుకుంటూ ఉంటారు. అదేదో బాహటంగా మాత్రం కాదు, అంతర్లీన ఒప్పందాల్లో భాగంగా, పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి ఆ సేవలు. పవన్ కళ్యాణ్ నే తీసుకుంటే 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టి  కూడా చంద్రబాబును సమర్థించి, తాను పోటీ చేయకుండా సాయం అందించిన పచ్చటి కొమ్మ పవన్ కళ్యాణ్. చంద్రబాబుపై ఉపద్రవం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ కలుగులోంచి తల బైటపెట్టి జగన్ నో చంద్రబాబునో తిట్టి వెళ్లిపోయేవారు. రోడ్లు మునిగితే ట్రాఫిక్ మళ్లించినట్టు బాబుకు మూడితే పవన్ వచ్చి టాపిక్ డైవర్ట్ చేసి వెళ్లేవారన్నమాట. ఇక మళ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. మరోసారి బాబును నమ్మండి అని చెబితే రాష్ట్రంలో అప్పుడే పుట్టిన బుడ్డోడు సైతం నమ్మే పరిస్థితి లేదు. దాంతో ప్లాన్ బి అమలౌతోంది. చంద్రబాబు అవినీతి అని అప్పుడప్పుడూ పవన్ కళ్యాణం ధ్వజం ఎత్తుతుంటాడు. టిడిపితో తగదా పడుతున్నట్టే అనిపిస్తుంటాడు. అంతలో ఉన్నట్టుండి జగన్ పై అభిమానం కురిపిస్తాడు. మరి కొద్ది రోజుల్లోనే ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంటాడు. పాలన చేసేది చంద్రబాబు ప్రభుత్వమైతే, విమర్శలు ప్రతిపక్ష పార్టీకి ఎందుకు అంటే బదులుండదు. 
ఇలాంటి మరో పచ్చటి కొమ్మ జెడీ లక్ష్మీనారాయణ. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ బాబు సేవలో తరించిన మహా నీతిమంతుడు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి బాబుకు అవసరమైనప్పుడు రాజీలు కుదిర్చే పనిలోకి దిగాడు. చంద్రబాబుపై తిరగబడ్డ ముద్రగడను బుజ్జగించి బాబుకు జైకొట్టేలా చేసి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎన్నికల సర్వేలు ఊపందుకుంటున్నవేళ లోక్ సత్తాతో కలుస్తానని, కాదు కొత్త పార్టీ పెడతానని రకరకాల ప్రకటనలతో కావాల్సినంత తమాషాను చేస్తున్నాడు. అపర మేధావి ముసుగులో అవినీతి ప్రభుత్వానికి చేతనైనంత సాయం అందిస్తున్నాడు.
పార్లమెంట్ స్థానం విషయంలో భంగపడి 2014లో ప్రత్యేకంగా పోటీ చేసి, చివరకు బోర్లాపడి, తిరిగి చంద్రబాబు కాళ్లమీద పడ్డాడు జేపీ. అమరావతి ఎక్కడుందంటూ పోటుగాడిలా ప్రశ్నలేసి, రాజధాని రావాలంటే చంద్రబాబే కావాలంటూ కొత్త మీసాలు మొలిపించుకొచ్చి దీక్షల్లో దండెత్తాడు శివాజీ. గ్రామస్థాయి రాజకీయ నాయకుడు కూడా కానీ ఈ శివాజీకి కేంద్రం రాష్ట్రంలోని చంద్రాబాబు ప్రభుత్వం మీద చేస్తున్న కుట్ర గురించి, ఆపరేషన్ గరుడ అంటూ దానికి పెట్టిన పేరుగురించి సిఎమ్ డాష్ బోర్డులో రాష్ట్ర సమస్యలు కనిపించినంత స్పషంగా తెలిసిపోయిందట. ఈ సీజనల్ స్టార్ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఫెర్ఫార్మ్ చేస్తూ చంద్రబాబుకు చేతనైన సాయం చేస్తుంటాడు. 
వీళ్లంతా ఆ పచ్చింటి కొమ్మలే. పైకి పార్టీలకి అతీతం అని మాట్లాడుతూ, ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నట్టు నాటకం ఆడుతూ తెరవెనుక చంద్రబాబు స్క్రిప్టుకు తెరమీద స్కిట్ వేస్తుంటారు. తమ ఒంటిమీద పచ్చ రంగు లేకుండా జాగ్రత్త పడుతున్నామనుకుంటారు కానీ వారి ముఖాల్లో బాబు మార్కు పచ్చబొట్టు కనిపిస్తోందని, ఆ విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తూనే ఉందని వారికెప్పటికి తెలిసేనో ఏమో?


 
Back to Top