<br/>గురివింద తన నలుపెరగకుండా ఎదుటివారి నలుపును వేలెత్తి చూపిస్తూ తెగ నవ్వుతుందట. నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో అలాగే రెట్టలు వేస్తున్నాడు. ’’ప్రపంచంలో ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయడంలో మోదీ సఫలీకృతం అయ్యారు. కానీ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో విఫలం అయ్యారు. ఐక్యతాప్రతిమ ఏర్పాటులో తెలుగును విస్మరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు’’ అంటూ లోకేష్ ట్వీటాడు. తెలుగంటే తెగ తడబడి పోయే చినబాబుకు తెలుగు భాషమీద ఎంత తెగులు పుట్టిందో...అదే దిగులు పుట్టిందో. దేశ భాషల్లో తెలుగు కనుమరుగైపోతోందని తెగ ఇదైపోతున్నాడు పాపం. కానీ తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని నిర్మాణంలో తెలుగు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన శిలాఫలకంలో తెలుగు అక్షరం ఒక్కటైనా ఉందేమో ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుండేది. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని నగర శంకుస్థాపనలో తెలుగు శిలాఫలకం ఉండదు కానీ ఎక్కడో ఉత్తర భారతంలో శిలాఫలకం మీద తెలుగు లేదని తెగ ఫీలైపోవడం విడ్డూరం. అసలు లోకేషు తెలుగు ప్రసంగాలతోనే రాష్ట్రంలో సగం తెలుగుభాష అంతరించిపోయిందని తెలుగు భాషా ప్రేమికులు తెలుగులో వాపోతున్నారు. మాతృభాషను రోజుకోసారి మృతభాషను చేసే మహానాయకుడు తెలుగు భాషా ప్రేమికుడు కావడం తెలుగుజాతి చేసుకున్న అదృష్టం కాక మరేమిటి? ఒక్క లోకేషే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిలాఫలకంలో తెలుగు లేదని తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని, ఇది మోదీ తెలుగు వారిపట్ల చూపుతున్న వివక్ష అనీ పెద్ద ప్రకటన చేసాడు. తెలుగు రాజధానిలో తన చేతులతో అమరావతిలో ఆంగ్ల ఫలకాన్ని ఆవిష్కరించిన ఈ పెద్దమనిషి తెలుగు భాషకు గుర్తింపు లేదని, తెలుగువారిపట్ల ఇది వివక్ష అని ఇంకొకళ్లకు నీతులు చెబుతున్నాడు. ఇంతా చేస్తే మోదీ ఆవిష్కరించిన అతిపెద్ద శిలాఫలకంపై 22 భారతీయ భాషలతో పాటు తెలుగుభాషలోనూ ’ఐక్యభారతం శ్రేష్ఠ భారతం’ అనే నినాదం రాసి ఉంది. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టు ఇలాంటి పచ్చ గురివిందలు తాము చేసిన తప్పులు గుట్టలుగా ఉంచుకుని, ఎదుటివారిని మాత్రం విమర్శిస్తుంటారు.