మినీ మ‌హానాడుల తీరు తెన్నులు..!


 చంద్ర‌బాబు పార్టీ స‌మావేశం ఏర్పాటు చేశాడు
`` త‌మ్ముళ్ళూ ఐక‌మ‌త్యమే మ‌హాబ‌లం `` అన్నాడు. వెంట‌నే ఇద్ద‌రు నాయ‌కులు క‌ర్ర‌ల‌తో బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. వాళ్ళ అనుచ‌రులు కూడా వీరంగ‌మేసి కొట్టుకున్నారు. ర‌క్తం పారింది.
 ``పార్టీ కోసం ర‌క్తం చిందించ‌డ‌మంటే ఇలా కాదు. అయినా కొట్టుకోవ‌డం కాంగ్రెస్‌ సంస్కృతి `` అన్నాడు బాబు
  `` త‌మ‌రితో స‌హా ఇక్క‌డున్న వారంతా కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వాళ్ళే సార్‌`` అన్నాడు పిఏ
  `` గ‌తాన్ని త‌వ్వితే అంద‌రం గోతుల్లోనే వుంటాం. దాని జోలికెళ్లకు `` అన్నాడు బాబు
 స‌భ‌లోని నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా చీలి తొడ‌లు కొట్టుకున్నారు.
`` తొడ‌కొట్ట‌డం మా బావ పేటెంట్ హ‌క్కు క‌దా, వీళ్ళెందుకు కొడుతున్నారు `` అన్నాడు బాబు
 `` ఆయ‌నిప్పుడు మ‌న పార్టీ ఎమ్మెల్యే క‌దా, అందుకే ప్రేర‌ణ పొందిన‌ట్టున్నారు `` చెప్పాడు పిఏ

 `` త‌మ్ముళ్ళూ నేను ముఠాత‌గాద‌ల్ని స‌హించ‌ను. అది మ‌న పార్టీ సంస్కృతి కాదు `` అని బెదిరించాడు బాబు
 `` చిత్తూరు జిల్లాలోని ముఠాత‌గాద‌ల వ‌ల్లే మీరు నాయ‌కుడ‌య్యారు. ఎన్టీయార్ పార్టీలో ముఠాత‌గాద‌ల్ని ప్రోత్స‌హించే ముఖ్య‌మంత్ర‌య్యారు. మీ మాట ఎవ‌రు వింటారు సార్ `` అన్నాడు పిఏ
   ఈ లోగా కుర్చీలు గాల్లోకి లేచాయి.
  `` కుర్చీ కోసం గాల్లో ప‌ల్టీలు కొట్టినా త‌ప్పులేదు. కానీ కుర్చీనే గాల్లోకి విస‌ర‌డం మూర్ఖ‌త్వం. మీ మీద యాక్ష‌న్ తీసుకుంటా `` అన్నాడు బాబు
 ఇదేమీ ప‌ట్టించుకోకుండా త‌మ్ముళ్ళు బూతులు తిట్టుకోసాగారు
 `` మ‌న ల‌క్ష్యం పోలింగ్  బూతులే కానీ ఈ బూతులే కాదు త‌మ్ముళ్ళు `` అని అన్నాడు బాబు
 ఈ లోగా త‌మ్ముళ్ళు బెల్ట్ లు తీసుకుని కొట్టు కోసాగారు.
 ``త‌మ్ముళ్ళు, వెన‌క‌టికి పంచెని గట్టిగా బిగించుకోడానికి మొల‌తాడు వుండేది. దాన్ని ఇంగ్లీష్ వాడు కాపీ కొట్టి బెల్ట్ త‌యారుచేసాడు. ఈ బెల్ట్ని వూడ‌దీయ‌డం వ‌ల్ల ప్యాంటులు వూడిపోయే ప్ర‌మాద‌ముంది. అప్పుడు మీ ప‌రువు పార్టీ ప‌రువు రెండూ గంగ‌లో క‌లుస్తాయి. ఈ న‌గ్న‌స‌త్యాన్ని తెలుసుకోండి`` అన్నాడు బాబు
 `` ఈ ఫైటింగ్ ఎపిజోడ్‌లో బెల్ట్ల హిస్ట‌రీ అవ‌స‌ర‌మా సార్‌`` అడిగాడు పిఏ
  `` చ‌రిత్ర‌ని విస్మ‌రించిన‌వాడు చ‌రిత్ర‌హీనుడ‌వుతాడు. హిస్ట‌రీ ఒక మిస్ట‌రీ ``.

 త‌మ్ముళ్ళు వెదురుబొంగులు తెచ్చుకొని కొట్టుకోసాగారు.
 `` కొన్నివేల ఏళ్ళుగా వెదురు మ‌న జీవితంతో పెన‌వేసుకుపోయింది. వెదురు లేకుండా ఇళ్ళు క‌ట్టుకోలేం. నాగ‌రిక‌త అంతా వెదురు మీదే ఆధార‌ప‌డివుంది. వెదురే మ‌న ఫ్యూచ‌ర్‌. మ‌నిషి ఎదుగుద‌ల వెదురులా వుండాలి. అతి వేగంగా ఎత్తుకు పెరిగే ఏకైక మొక్క వెదురు `` అన్నాడు బాబు
 ఈ సారి త‌మ్ముళ్ళు కత్తులు తీసుకున్నారు
`` క‌త్తి, సుత్తి లేకుండా మాన‌వ‌వికాసం లేదు. క‌త్తితో ప‌ళ్ళు కోసుకోవ‌చ్చు, యుద్ధాలు చేయ‌చ్చు `` అన్నాడు బాబు
 `` వెన్నులో కూడా పొడ‌వ‌చ్చు `` అన్నాడు పిఏ
 `` నువ్వు నోర్మూయ్ ``
`` అయినా ఇలా క‌బుర్లు చెప్ప‌క‌పోతే, వాళ్ల యుద్ధాన్ని ఆప‌చ్చుగా``
`` వాళ్ళు అలా కొట్లాడుతూ వుంటేనే నాకు సేఫ్‌. అంతా ప్ర‌శాంతంగా వుంటే నా సీటుకి ఎస‌రు  పెడ‌తారు `` అన్నాడు బాబు
Back to Top