కలల విహారం

చంద్రబాబు మనతో ఎప్పుడూ చేయించేది ఇదే. కలల విహారం. అమరావతి పేరుతో భ్రమరావతిని మన కళ్లకు చూపిస్తాడు. అభివృద్ధి పేరుతో మాటలతోనే మాయా లోకం సృష్టిస్తాడు. అన్నీ మీ కళ్లముందే ఉన్నాయంటూ కనికట్టు చేస్తాడు. పునాది రాళ్లు వేసి పనులైపోయాయని ప్రచారం చేసుకుంటాడు. విమానాల్లో విదేశాలు తిరిగి లక్షల కోట్ల పెట్టుబడులు దారిలో ఉన్నాయంటాడు. కంపెనీలు కోకొల్లుగా వచ్చేస్తున్నాయంటాడు. లక్షల ఉద్యోగాలిచ్చేస్తున్నాయంటాడు. అన్నిట్లో ఎపి నెంబర్ వన్ అయిపోయిందంటాడు. అడక్కుండానే అందరూ అప్పులిచ్చేస్తున్నారంటాడు. బాబు మాటలు మూడు నిమిషాలు వింటే మనం ఆంద్రప్రదేశ్ లో కాక అద్భుత ప్రదేశ్ లో ఉన్నామనే కలలో మనల్ని ముంచేస్తాడు. వాస్తవాలు అర్థం అయ్యేలోపు అవినీతి లో రాష్ట్రాన్ని అగ్రస్థానాన నిలబెట్టేస్తాడు. 
ఇంతటి ప్రతిభావంతుడైన చంద్రబాబుకు పైలట్ అవ్వాలనే కోరిక ఒకటి మిగిలిపోయిందట. ఇదివిన్న తెలుగు వాళ్లందరూ హవ్వా అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజలను రెక్కలు లేకుండానే గగన విహారం చేయించిన బాబు పైలెట్ కాలేదని పరేషాన్ అవ్వడమేంటా అని ఆశ్చర్యపోతున్నారు. అయినా ఎపిలో ఎయిర్ లైన్స్ తెచ్చింది తానే అని, పైలెట్లకు విమానం నడిపే ట్రైనింగ్ ఇచ్చింది నేనని చెప్పుకుంటాడని ఎక్స్ పెక్ట్ చేస్తే ఇలా నేను పైలెట్ అవ్వాలనుకున్నాను అని చెప్పాడేమిటబ్బా అని కొందరు జుత్తు పీక్కున్నారు. చంద్రబాబు నేల మీద నడుస్తుంటేనే ప్రజలకు ఇన్ని మాయలు చూపిస్తున్నాడు....అదే పైలెట్ అయ్యుంటే చంద్రమండలంలో అభివృద్ధి, సూర్యుడికి టెక్నాలజీ, గ్రహాలకు గతులు కూడా నేనే నేర్పించానని చెప్పుండేవాడేమో అని అనుకుంటున్నారు బాబు సంగతి బాగా తెలిసిన పెద్దలు.
ఏదేమైనా బాబు పైలట్ కోరిక ఓ తీరని కోరికగా మిగిలిపోకుండా రేపటి ఎన్నికల గురించి కలలు కంటూ గగన విహారం చేసుకోవడం మంచిదేమో అని కొందరు సలహా ఇస్తున్నారు. 
 
Back to Top