అయిన‌ను పోయిరావ‌లె!

చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్ళివ‌చ్చి విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసాడు. 
"‌సార్, ఢిల్లీకి ఎందుకు వెళ్లారు?"‌ అడిగాడో విలేక‌రి
"‌బంజారాహిల్స్‌లోని మా ఇంటి నుంచి కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాను. అక్క‌డి నుంచి ఫ్ల‌యిట్‌లో ఢిల్లీకి బ‌య‌లుదేరాను. ఫ్ల‌యిట్ బాగానే వుంది. గంట‌సేపు జ‌ర్నీ. అక్క‌డ దిగిన త‌రువాత ఆంధ్రాభ‌వ‌న్‌కి వెళ్లాను...."‌ 
"‌మేము అడిగింది ఢిల్లీకి ఎలా వెళ్లార‌ని కాదు.... ఎందుకు వెళ్లార‌ని?"‌ 
"‌ఢిల్లీని ఒకప్పుడు హ‌స్తినాపురి అనేవాళ్లు. అక్క‌డ ఎండాకాలం ఎండ‌గానూ, చ‌లికాలం మ‌రింత చ‌ల్ల‌గా వుంటుంది. ఒకప్పుడు కొత్త ఢిల్లీ పాత ఢిల్లీ అని వుండేవి. ఢిల్లీలో రోడ్లు బాగా విశాలంగా వుంటాయి..."‌ 
"‌సార్‌, ఢిల్లీ ఎలా వుంటే మాకెందుకు?  ఢిల్లీకి ఎందుకు వెళ్లార‌ని.."‌ 
"‌ఒక ముఖ్య‌మంత్రికి ఢిల్లీకి వెళ్లే హ‌క్కు లేదా? ఈ దేశ‌పౌరుడిగా ఢిల్లీకి ఎవ‌రైనా వెళ్ల‌చ్చు..."‌ 
ఈ సోది మాక‌న‌వ‌స‌రం. ఇంత‌కూ మీరు ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధానిని క‌లిసారా? లేదా?"‌ 
"‌క‌లిసాను. ఆయ‌న బంగ్లా ఎంత బావుంటుందంటే చుట్టూ తోట‌, పుల్ సెక్యూరుటీ. ఆ తోట‌లో మామిడి, వేప‌, కానుగ‌, చింత‌, మ‌ర్రి, టేకు..."‌ 
"‌సార్ పాయింట్‌కి రండి"‌ 
"‌ఈ  చెట్ల‌న్నీ దాటుకుని ప్ర‌ధాని ఇంట్లోకి వెళ్లాను. వెళ్లి కూచోగానే మంచి టీ వ‌చ్చింది. ఆ టీ పౌడ‌ర్‌ని అస్సాం నుంచి తెప్పించారు. ప్ర‌ధాని ఇంట్లో ఎంత‌మంది వంట‌వాళ్లుంటారో తెలుసా... ఎలాంటి డిష్ అయినా క్ష‌ణాల్లో చేస్తారు..."‌ 
"‌మ‌హా ప్ర‌భూ... మీరు ప్ర‌ధానితో ఏం మాట్లాడారు?"‌ 
"‌ఆ విష‌యానికే వ‌స్తున్నా... ప‌ది నిమిషాల్లో ప్ర‌ధాని వ‌చ్చారు. తెల్ల‌టి కుర్తా, పైజ‌మా వేసుకున్నారు. ఆయ‌న రోజూ యోగా చేస్తారు కాబ‌ట్టి బాడీ బాగా మెయింటెయిన్ చేస్తారు. నేను లేచి దండం పెట్టాను. చంద్ర‌బాబుజీ అని ప‌లక‌రించారు. నేను వ‌చ్చిరానీ హిందీ, ఇంగ్లీష్ మాట్లాడినా ఆయ‌నేం ప‌ట్టించుకోలేదు. ఒక‌రి క్షేమాలు ఇంకొక‌రు అడిగాం. ఈ సారి టీతో పాటు బిస్కెట్లు వ‌చ్చాయి. ప్ర‌ధానికి ఉస్మానియా బిస్కెట్లంటే బాగా ఇష్టం. అస‌లా బిస్కెట్ల‌కి ఉస్మానియా అనే పేరు ఎలా వ‌చ్చిందంటే..."‌ 
"‌సార్, మీతో ప్ర‌ధాని ఏమ‌న్నారు?"‌ 
"‌విజ‌య‌వాడ‌లో ఎండ‌లు ఎలా వున్నాయ‌ని అడిగారు. మండిపోతున్నాయ‌ని చెప్పాను. నిజానికి బెజ‌వాడ‌ని బెజ్‌వాడ అంటార‌ని చెప్పాను. ఒక‌సారి వ‌చ్చి దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం చేసుకుని వెళ్లామ‌ని అడిగాను. త‌న‌కు భ‌క్తి ఎక్కువ‌ని వీలు చూసుకుని వ‌స్తాన‌ని అన్నారు.
ట్విట్ట‌ర్‌లో ఆయ‌న సందేశాలు చాలా బావుంటాయ‌ని చెప్పాను. నాకు కూడా టెక్నాల‌జీ అంటే బాగా ఇష్ట‌మ‌ని అన్నాను. సూప‌ర్ అని ప్ర‌సంసించారు. త‌మ వంటి నాయ‌కుడు లేడ‌ని పొగిడాను. స్వ‌చ్ఛ‌భార‌త్ ఎలా వుంద‌ని అడిగారు సూప‌ర్ అన్నాను.
ఆయ‌న నౌక‌రుని పిలిచి ఎసీ మరీ ఎక్కువ‌గా వుంది త‌గ్గించ‌మ‌న్నారు. ఎసీలో ఎక్కువ‌గా ఉంటే కొన్ని ఆరోగ్య‌క‌ర ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెప్పాను. శ్ర‌ద్ధ‌గా విన్నారు...."‌ 
"‌ప్ర‌త్యేక హోదా గురించి అడిగారా లేదా?"‌ 
"‌మిత్ర‌ప‌క్షం క‌దా, నేరుగా అడిగితే బావుండ‌ద‌ని, అవిఇవీ మాట్లాడి, చివ‌రికి చెవిలో ప్ర‌త్యేక‌హోదా ఏమైంది అని మెల్లిగా అడిగాను. ఆయ‌న‌కి స‌రిగా వినిపించిన‌ట్టు లేదు. జోదా అక్బ‌ర్ సినిమా నేను కూడా చూసాన‌ని బావుంద‌ని అన్నారు. ఇంకా అడిగితే బావుండ‌ద‌ని లేచి వ‌చ్చేసాను. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఫ్ల‌యిట్ ఎక్కి..."‌ 
"‌ఇక సుత్తి వ‌ద్దుసార్‌, అర్థ‌మైంది. మీరు ఢిల్లీకి వెళుతూ వుంటారు... వ‌స్తూ వుంటారు. హోదా రాదు, ఇవ్వ‌రు... అంతేకదా..."‌ అని విలేక‌రులు వెళ్లిపోయారు.
Back to Top