విశాఖపట్నం: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖపట్నం త్వరలో పరిపాలన రాజధాని కానుందని ఉమ్మడి విశాఖ వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం పేరిట అన్నివర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తూ ప్రస్తుత రాజకీయాలకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. ఆదివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, చివరకు వరద బాధితులను పరామర్శించడానికి వెళుతూ కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వరద నీటిని చూపించి తాగునీరు అంటూ మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని అన్నారు. వరద బాధితులను తక్షణ సహాయం అందిస్తూ ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. ఆ వివాదం టీటీడీకి సంబంధించినది కాదు శ్రావణ భార్గవి పాటల వివాదం టీటీడీకి సంబంధించినది కాదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిపై ఏవిధంగా స్పందిస్తామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కల్గించడం మహాపాపం అన్నారు. తొలి వాగ్గేయుకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నామని పేర్కొన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అన్నమయ్య ఏ మార్గాన్ని ఎంచుకుని నడుచుకుంటూ వెళ్లారో.. ఆ మార్గాన్ని మూడో మార్గంగా టీటీడీ అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా అన్నమయ్య పేరును ఒక జిల్లాకు పెట్టి అన్నమయ్యపై ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పామన్నారు.