చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని టీటీడీ చైర్మన్, చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపఎన్నికపై సమాలోచనలు చేశారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బై ఎలక్షన్‌లో మా పార్టీ అభ్యర్థి ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాత్రమే తాము ప్రచారం చేస్తామని, గత ఎన్నికలలో కంటే ఎక్కువ మెజార్టీ సాధించటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటేగౌడ్, ఎంపీ రెడ్డెప్పలు పాల్గొన్నారు.