ఆప‌ద‌లో  ‘108’ అంబులెన్సులు  

108ల నిర్వహణను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం

డీజిల్‌లేక రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 290 వాహనాలు

ప్రస్తుత నిర్వహణ సంస్థకు ఏప్రిల్‌ నుంచి బిల్లులు నిలిపివేత

నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను తప్పిస్తున్నట్లు ఎల్లో మీడియాలో లీకులు

దీంతో అరువుపై డీజిల్‌ పోయడానికి పెట్రోల్‌ బంకుల వెనుకడుగు

నిధులు చెల్లించకపోతే సేవలకు అంతరాయం తప్పదని ప్రభుత్వానికి అరబిందో లేఖ 

అయినా నయాపైసా చెల్లించని ప్రభుత్వం

అస్మదీయులకు కాంట్రాక్టు కట్టబెట్టడానికే ఈ పన్నాగం

అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెనుముప్పు దాపురించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు అండగా నిలవాల్సిన ‘108’ అంబులెన్సులకు పెద్దఆపద వచ్చింది. ఈ ఆప­ద్భాందవికి ఫోన్‌చేస్తే కుయ్‌ కుయ్‌మంటూ నిమిషాల్లో ఘటనా స్థలంలో వాలిపోయి బాధితులకు చేయూతనివ్వాల్సిన అంబులెన్స్‌లు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్లక్ష్యంగా కారణంగా డీజిల్‌లేక ముందుకు కదలడంలేదు. ఇలా బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 290 అంబులెన్స్‌లు ఆగిపోయాయి. దీంతో.. వైద్యసాయం కోసం 108కు ఫోన్‌చేసిన వారికి ‘మీ దగ్గరలో అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆస్పత్రులకు వెళ్లండి’ అని కాల్‌ సెంటర్‌ ప్రతినిధు­లు బదులిచ్చారు. 

బిల్లులు మంజూరు చేయాలని కోరినా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రా­క్టులన్నీ అస్మదీయులకు కట్టబెట్టడంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే 108 అంబులెన్సులు, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ) నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను తప్పించడానికి పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ నుంచి నిర్వహణ సంస్థకు చెల్లించా­ల్సిన బిల్లుల్లో ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఇలా ఏకంగా రూ.141 కోట్ల బిల్లులు నిలిచిపోవడంతో గడిచిన మూడు నెలలుగా 104, 108 సిబ్బందికి అర­బిందో సంస్థ వేతనాలు చెల్లించలేదు. మరో­వైపు.. డీజిల్‌ కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు.

అయినప్పటికీ దీపావళికి ముందు 108 కాల్‌ సెంటర్‌ నిర్వహణ సంస్థకు బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం అరబిందోకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఒకవైపు ఎంఓయూ రద్దుచేసుకుని వెళ్లిపోవాలని సంస్థపై ఒత్తిడి చేస్తూనే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంటోందని ఎల్లో మీడియా లీకులిచ్చి కథనాలు రాయించింది. దీంతో కొన్ని రోజులుగా అరువుపై డీజిల్‌ పోసే పెట్రోల్‌ బంకులు సైతం రెండు మూడ్రోజులుగా చేతులెత్తేశాయి. దీంతో.. 108 సేవలకు అంతరాయం ఏర్పడుతుందని.. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అరబిందో సంస్థ మంగళవారం ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఐదు నెలలుగా బిల్లులు నిలిచిపోవడం, రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా లేకపోవడంతో వారం, పది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డీజిల్‌లేక అంబులెన్సులు నిలిచిపోతున్నా బాబు సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

నాలుగుసార్లు ఫోన్‌చేసినా రాలేదు..
మా అమ్మాయి తేళ్లూరు అశ్రితకు కడుపులో నొప్పి రావడంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారు. ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు నాలుగుసార్లు ఫోన్‌చేసినా 108 రాలేదు. దీంతో.. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు పెట్టే స్థోమతలేక బస్సులో విజయవాడ తీసుకెళ్లాం.  – తేళ్లూరు నాగేశ్వరరావు, చాట్రాయి

సాయం అందక హాహాకారాలు..
నిజానికి.. 2019కు ముందు బాబు పాలనలో   కునారిలి్లన 108 వ్యవస్థకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఊపిరిలూదుతూ 768 అంబులెన్సులతో బలోపేతం చేసింది. ఇందులో బ్యాకప్‌ పోను 731 వాహనాలు క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందిస్తుంటాయి. ఇలా సగటున రోజుకు మూడువేలకు పైగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అంబులెన్సులు అండగా నిలుస్తున్నాయి. అంటే..  రోజుకు నాలుగు పైగా కేసులకు ఒక్కో అంబులెన్స్‌ అటెండ్‌ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో డీజిల్‌లేక బుధవారం ఒక్కరోజే 290 అంబులెన్సులు నిలిచిపోయాయి.

500లోపు వాహనాలు అరకొరగా సేవలు కొనసాగిస్తున్నాయి. ఉదా.. ఏలూరు జిల్లాలో 108 వాహనాలు మొత్తం 29 ఉండగా మంగళవారం డీజిల్‌లేక 12 వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాటిల్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రా­యి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూ­రు, మండవల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెంలకు చెందిన వాహనాలున్నాయి. ఇక మంగళవారం 108 అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన బాధితులు ప్రైవేట్‌ అంబులెన్సులను ఆశ్రయించలేక హాహాకారాలు చేస్తున్నారు.

⇒ ఈ చిత్రంలోని మహిళ అనంతపురం రూరల్‌ మండలంలోని ఆలమూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. 108 వాహనం కోసం పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో కుటుంబీకులే రూ.500 బాడుగతో ఆటో మాట్లాడుకుని 15 కి.మీ దూరంలోని సర్వజనాస్పత్రికి ఆమెను తీసుకువచ్చారు.

⇒ ఈ చిత్రంలోని మహిళ పేరు పార్వతమ్మ. స్వగ్రామం అనంతపురం జిల్లా ముద్దలాపురం. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు 108 వాహనం కోసం ఫోన్‌ చేయగా.. అదిగో.. ఇదిగో అంటూ మధ్యాహ్నం వరకూ గడిపారు. ఆ తర్వాత స్పందించ లేదు. దీంతో కుటుంబీకులు 32 కి.మీ దూరంలోని అనంతపురం సర్వజనాస్పత్రికి ఆటోలో తీసుకువచ్చారు. 

Back to Top