మీదే కదా ఉన్మాదుల కర్మాగారం?

ఆధారాలతో సహా చూపిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

టీడీపీ సోషల్‌ మీడియా పోస్టుల సంగతేమిటి?

అప్పటి సీఎంపై టీడీపీ ప్రతినిధి అన్న మాటలకు ఏం చెబుతారు?

వైయ‌స్ జగన్‌గారిని సైకో అని నిందించడం నేరం కాదా?

నారా లోకేశ్‌ ట్వీట్లలో ఇష్టానుసారం తిట్టొచ్చా?

వైయ‌స్ఆర్‌ కుటుంబంపై ఎల్లో మీడియాలో రోజూ అసత్యాలు

ఇవన్నీ వాస్తవాలు కావా? మరి టీడీపీది సన్మార్గుల కర్మాగారమా?

:సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు

మాజీ మంత్రులు రోజా, రజనిపై అసభ్యకర పోస్టులు 

నారా లోకేశ్‌ డబ్బులిచ్చి చేయిస్తున్నారని అనుమానం

అధికార పార్టీవి అంతులేని అరాచకాలు. అనైతిక చర్యలు

అయినా పట్టని పోలీసులు. మా పార్టీపైనే కేసులు, అరెస్టులు

ప్రైవేటు కేసులతో పోలీసుల అరాచకాలు ఎదుర్కొంటాం

కూటమి అక్రమాలపై న్యాయస్థానాల్లో పోరాడతాం 

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు స్పష్టీకరణ

 తాడేపల్లి: సీఎం     చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా, లోకేశ్‌ ఎన్ని రకాలుగా బెదిరించినా, కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీశ్రేణులపై ఎన్ని రకాలుగా దాడులు చేసినా సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అయిదు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవడం లేదని.. ఈ నేపథ్యంతో తమను ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న లక్ష్యంతో, తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు, అన్యాయంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులపై న్యాయస్థానాల్లో పోరాడతామని ప్రకటించారు.  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

టీడీపీ సోషల్‌ మీడియాలో..:
    వైయ‌స్ఆర్‌సీపీది ఉన్మాదుల కర్మాగారమైతే టీడీపీది సన్మార్గుల కర్మాగారమా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. టీడీపీ అధికార సోషల్‌ మీడియా ఖాతాల్లో మాజీ సీఎం వైయ‌స్‌ జగన్, ఆయన సతీమణి వైయ‌స్‌ భారతి, వైయ‌స్ఆర్‌ కుటుంబంపై రాసిన జుగుప్సాకరమైన పోస్టులు, అసభ్యకరమైన ఎడిటింగ్‌లను చూపించిన ఆయన, వాటిపై సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, మంత్రి నారా లోకేష్‌తో పాటు, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ రాత్రివేళల్లో ఆత్మలతో మాట్లాడతాడంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాసిన కథనాలను, వైయ‌స్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజుల అసభ్య పదజాలంతో పాటు, ఏబీఎన్‌ తదితర ఎల్లో మీడియా న్యూస్‌ ఛానళ్లలో వ్యాఖ్యలు, విమర్శలు.. సోషల్‌ మీడియాలో ఉన్మాదుల పోస్టులను ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాకు చూపారు. వైయ‌స్ జగన్‌గారి మాదిరిగా క్యారెక్టర్లను సృష్టించి ఎగతాళి చేయడం, మాజీ మంత్రి రోజాపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు, తప్పుడు ప్రచార ఫొటోలను కూడా మీడియాకు ప్రదర్శించిన అంబటి, మంత్రి నారా లోకేశ్‌ వారందరికీ డబ్బులిచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

నన్ను, నా కుటుంబాన్నీ వదల్లేదు: 
    ఘర్షణ అనే అకౌంట్‌ నుంచి వెంగళరావు అనే వ్యక్తి  తన మీద, తన కుమార్తెల మీద చేసిన దారుణమైన పోస్టులను చూపించిన అంబటి రాంబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనిపై సోషల్‌ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన ట్రోలింగ్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్య లేదని చెప్పారు. స్వాతి చౌదరి అనే యువతి లండన్‌ నుంచి స్వాతి రెడ్డి పేరుతో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి అత్యంత నీచంగా తమ అధినేత జగన్‌తో పాటు, పార్టీ నాయకులపై ఇష్టానుసారం పోస్టులు పెట్టి, వీడియోలు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. 

    సోషల్‌ మీడియా వేధింపులకు ఎవరూ అతీతులు కాదనే విషయం పవన్‌ కళ్యాన్‌ తెలుసుకోవాలన్న అంబటి, ఎవరైనా ఖండించాల్సిందేనని పేర్కొంటూ తమ కుటుంబాలపై అసభ్య ప్రచారం చేసిన కూటమి కార్యకర్తలపై నిష్పాక్షకంగా చర్యలు తీసుకునే దమ్ముందా? అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్‌ కుటుంబంపై పోస్టులు పెట్టిన వారిని కూడా శిక్షించాల్సిందేనని చెబుతూ, 2019 ఎన్నికలకు ముందు పవన్‌ అన్న మాటలు గుర్తు చేశారు. 
    ‘తనపై, తన తల్లిపై నారా లోకేశ్, ఏబీఎన్‌ రాధాకృష్ణ అభ్యంతరకంగా పోస్టులు పెట్టించారని’ చెబుతూ ఎల్లో మీడియాను బహిష్కరించాలని పిలుపునిచ్చిన పవన్, తిరిగి చంద్రబాబుతో జత కట్టి, ఆయన్నే గెలిపించాలని ఎందుకు పోరాటం చేశారని అంబటి ప్రశ్నించారు. ఆఖరుకి  చంద్రబాబు సైతం, అప్పటి సీఎం జగన్‌ను ఉద్దేశించి సైకో పోవాలి.. సైకిల్‌ రావాలంటూ ప్రచారం చేయడాన్ని సమర్థించుకుంటారా అని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లలో సైతం ఆ పార్టీ అధికార ప్రతినిధులతో దారుణంగా తిట్టించారని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

డీజీపీ స్పందన బట్టి కార్యాచరణ:
    అమ్మకు నిల్లు.. నాన్నకు ఫుల్లు అన్న పోస్టులను కూడా తప్పు పడుతూ ఈ ప్రభుత్వం అరెస్ట్‌ చేయించిందని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్,  కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరామన్న అంబటి, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటే సరే.. లేదంటే న్యాయస్థానాల్లో పోరాడతామని వెల్లడించారు.
    డీజీపీ సరిగా స్పందించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్‌ కంప్లైంట్‌లపై న్యాయస్థానం వేగంగా స్పందించిందన్న అంబటి, పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు. న్యాయబద్ధంగా ప్రభుత్వ అవినీతిని, దౌర్జన్యాలను ఎదుర్కొంటామని అంబటి రాంబాబు వివరించారు.

Back to Top