అనంతపురం: తాడిపత్రిలో అధికార టీడీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. సజ్జలదిన్నెలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్‌లో వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పెద్దారెడ్డి , పార్టీ తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఇలాంటి హింసాత్మక చర్యలపై కఠిన చర్యలు అవసరమని వ్యాఖ్యానించారు. పెద్దారెడ్డికి భద్రత కల్పించలేం: ఎస్పీ తన స్వగ్రామమైన తాడిపత్రికి రావడానికి భద్రత కోరుతూ జిల్లా ఎస్పీ జగదీష్ కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ ఎస్పీ చేతులెత్తేశారు. ఈ నెల9వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటన అనంతరం పోలీస్ భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లే అవకాశం ఉంది. కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా ఆయన ఇంకా అక్కడకి వెళ్లలేకపోయారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎలా అడుగుపెడతారో చూస్తామంటూ టీడీపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు.