ఎమ్మెల్యే వాసు చేసేవ‌న్నీ స్కామ్‌లు..చెప్పేవి శ్రీ‌రంగ నీతులు

గౌతమీ సూపర్ బజార్ స్థలంలో అక్రమ నిర్మాణం తక్షణం ఆపాలి 

త‌న‌పై చేసిన  అవినీతి ఆరోపణలు నిరూపించి, చిత్తశుద్ధి చాటుకోవాలి

ఎమ్మెల్యే వాసుకి బహిరంగ సవాల్ విసిరిన మాజీ ఎంపీ మార్గాని భరత్

రాజ‌మండ్రి సిటీలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ధర్నా 

రాజమహేంద్రవరం :  రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు  చేసేవ‌న్నీ స్కామ్‌లు..చెప్పేవ‌న్నీ శ్రీ‌రంగ నీతుల‌ని
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శించారు. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న త‌న‌పై గౌతమీ సూపర్ బజార్ స్థలం గురించి  అవినీతి  ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు  ఇప్పుడు వాటిని  నిరూపించి వాస్తవాలు ఏమిటో తేల్చాలని  ఆయ‌న స‌వాల్‌ చేశారు. ఐదు కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు నిర్మాణం ఆపడం లేదని ఆయన ప్రశ్నించారు.  స్థానిక ప్రభుత్వ పశువుల ఆసపత్రి ఎదురుగా గల  గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన స్థలంలో  నిర్మిస్తున్న భవంతి వద్ద బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి భరత్  ఆందోళన నిర్వహించారు. అక్రమ కట్టడం ఆపాలి, అవినీతితో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలి, అవినీతి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినదించారు. చేసేవన్నీ స్కామ్ లు.. గౌతమీ సూపర్ బజార్ భూమిపై చేసిన ఆరోణలు నిరూపిస్తారా .. ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా,  నిజాల నిగ్గు తేల్చుకుందాం వస్తారా బహిరంగ చర్చకు అనే నినాదాలతో ప్ల కార్డులు ప్రదర్శించారు. 
      ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన నీవు సదరు కాంట్రాక్టర్ ని ఎదురుగ పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేసారు. సుమారు 300గజాల ఈ స్థలం ఖరీదు ఎంత, నాకు ఐదు కోట్ల రూపాయలు లంచం ఎక్కడ, ఎప్పుడు ఎందుకు ఇచ్చారో నిరూపించాల్సిన బాధ్యత ఆరోపణ చేసిన శాసన సభ్యునికి లేదా అని ఆయన నిలదీసారు. ఒకవేళ కోర్టులో అంశం ఉంటె, అన్యాయంగా అక్రమంగా లీజుకి తీసుకున్నారని చెప్పినపుడు రద్దు చేయించాలి కదా అని భరత్ ప్రశ్నించారు.   నా మామ అచ్చెన్నాయుడికి చెప్పానని, దీన్ని ఆపేస్తానని చెప్పావని, అలాగే నా బామ్మర్దికి చెప్పేసాను, ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చి, అక్రమంగా  మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతుంటే, ఆపకుండా  ఏం చేస్తున్నావని భరత్ సూటిగా ప్రశ్నించారు. ఇంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తిని స్వాహా చేసే కార్యక్రమం చేపడితే ఎమ్మెల్యే గా ఉన్న నువ్వు నిద్రపోతున్నావా అని ఆయన నిలదీసారు. అదే నీ సొంత స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటావా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పరిరక్షించాల్సిన బాధ్యత లేదా అన్నారు. నాలుగు పక్కల కలిపి పది అడుగులు స్థలం వదిలితే మూడు ఫ్లోరులు కడుతున్నారా లేదా, ఒకవేళ అలా కట్టకపోతే అనధికార కట్టడం అవుతుందా లేదా చెప్పాలని ప్రశ్నిస్తున్నామని భరత్ అన్నారు. ఒకపక్క నగర నడిబొడ్డులో విలువైన స్థలం అన్యాక్రాంతం అయిందని ఇదే ఎమ్మెల్యే చెబుతూ , నిలుపుదల చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఏమనాలన్నారు. ఎమ్మెల్యేగా ఆపడం చేతకాకపోతే హైకోర్టులో మేము ఇంప్లిడ్ అవుతామని భరత్ ప్రకటించారు. నీకు అంకితం భావం ఉంటె , హైకోర్టులో జిపి ద్వారా ఆపాలని, లేకుంటే తాము ఆపుతామని ఆయన హెచ్చరించారు. 

 అలాగే నేను  ఎంపీగా ఉన్న నాపై అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పలు ఆరోపణలు చేశారని, ముఖ్యంగా  ప్రతి పనిలోనూ 25 శాతం కమీషన్ పుచ్చుకున్నట్లు  ఆరోపణ చేస్తూ కరపత్రాలు వేసి, ఊరంతా జల్లారని  భరత్ గుర్తుచేసారు. మరి  ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నందున వాటిని నిరూపించాలని ఆయన  సవాల్ విసిరారు.  ఎవరు కమిషన్ ఇచ్చారో నిరూపించాల్సిన బాధ్యత లేదా అన్నారు. నిరూపించకపోతే  నీవు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి , నన్ను ఓడించడానికి ఓ నీచమైన ఘటనగా మిగిలిపోతుందని భరత్ వ్యాఖ్యానించారు. 
  ఇక అయితే గతంలో మంత్రి ఆదిమూలపు సురేష్ రూ 22కోట్ల అంచనాతో  శంకుస్థాపన చేసారని, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి 125కోట్లు స్పెషల్ గ్రాంటు ఇచ్చారని అందులో భాగంగా 22కోట్లు మున్సిపల్ ఎక్కౌంట్ లోకి వచ్చాయని భరత్ వివరించారు. ఇప్పుడు గోదావరి గట్టు దగ్గర శంకుస్థాపన అంటూ హడావిడి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేసారు.  ఆ రూ.22 కోట్లతో చేయకుండా కుదించి 8కోట్లతో చేయ‌డం ఏమిటని ఆయన నిలదీశారు.

Back to Top