అంబేద్కర్ కోనసీమ జిల్లా: అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం వలన , కనీస గిట్టుబాటు ధర అందకపోవటం వలన రైతుకు అండగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్ వద్ద రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..`పంట చేతికొచ్చేన తరుణంలో ఇటీవల ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా గాలి, వాన బీభత్సం సృష్టించింది. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిచిపోయింది. వరి ధాన్యం, మొక్కజొన్న కండెలు, గింజలు వర్షానికి తడిచి నానిపోయాయి. పొలాల్లో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ముఖ్యంగా అధికారులు ప్రాథమిక అంచనాలను సేకరించుకుని తమ వద్ద భద్రపర్చుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదు` అంటూ వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రిలే దీక్షలో మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గొల్లపల్లి సూర్య రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి , ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, సూర్యనారాయణ, ఇజ్రాయిల్, పొన్నాడ సతీష్, గన్నవరపు శ్రీనివాస్, సూర్య ప్రకాష్, విప్పర్తి వేణుగోపాల్, పినిపే శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.