నో డౌట్‌..  అధికారంలోకి వ‌చ్చేది మ‌న‌మే

పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి

ప్ర‌స్తుతం కలియుగం పాలిటిక్స్‌ నడుస్తున్నాయి

మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి

ఇప్పుడు చంద్రబాబు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు

మ‌నం సెకీతో యూనిట్‌ రూ.2.49లకే విద్యుత్‌ కొనుగోలు చేశాం..

కూట‌మి ప్ర‌భుత్వం ఇవాళ రూ.4.60లకు కొనుగోలు 

ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది

ఈ సారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత 

 చంద్రబాబులా నేను అబద్ధాలు చెప్పలేను 

వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం 

వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో  వైయ‌స్ జగన్ భేటీ

తాడేపల్లి:  రాష్ట్రంలో తప్పకుండా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసం చేశార‌ని మండిప‌డ్డారు.  విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయ‌ని అన్నారు.  రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తూ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు  పాల్ప‌డుతున్నార‌ని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమ‌న్నారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌.. పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైయ‌స్‌ జగన్‌ వారితో చర్చించారు.

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 

ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు:
    చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు..  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేసిన తర్వాత, మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. మీలో అందరూ నాతోనే  నేరుగా సన్నిహిత సంబంధాలు ఉన్న వారు. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. 
    పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా  ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్‌ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాం. గడిచిన 11 నెలల కాలంగా ఆ దిశలోనే అడుగులు వేశాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్‌ కమిటీల వరకు అన్ని పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం.
    జిల్లా అధ్యక్షులు ఒక్కరే ఈ పూర్తి బాధ్యత నెరవేర్చలేరు. వాళ్లకు కూడా సరైన సపోర్ట్‌ మెకానిజమ్‌ క్రియేట్‌ అయితేనే వాళ్ల బాధ్యతను వాళ్లు సక్రమంగా చేయగలుగుతారు. ఆ సపోర్ట్‌ ఎకో సిస్టంలో భాగంగానే రీజినల్‌ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్‌ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.

రీజినల్‌ కోఆర్డినేటర్లు. సమన్వయం: 
    జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్‌ కోఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఆ పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో బావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. పార్టీ ఇంట్రెస్ట్‌ మాత్రమే మనసులో పెట్టుకుని పార్టీ అభ్యర్ధులను బలోపేతం చేయడానికి టైం కేటాయించే వ్యక్తులనే నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడే విధంగా పని చేస్తారు. రీజినల్‌ కోఆర్డినేటర్లకు కాళ్లూ చేతులుగా పార్లమెంటరీ పరిశీలకులు పని చేస్తారు. వీళ్ళను ఆయా రీజినల్‌ కోఆర్డినేటర్లతో మ్యాపింగ్‌ చేస్తాం. 
    పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్‌ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. కమిటీల నియామకాల ప్రక్రియలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తతో పని చేసేందుకు జిల్లా అధ్యక్షుడితో కలిసి పని చేస్తూ వారికి తోడ్పాటును అందిస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఉంటారు.  

ప్రజలకు మరింత చేరువగా..:
    ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేటట్టు మోటివేట్‌ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రజలకు అందుబాటులో ఉండేట్లు చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే.
    ఏ ఎమ్మెల్యే అభ్యర్ధి అయినా చిరునవ్వుతో ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు మన్ననలు పొందుతారు. నియోజకవర్గ అభ్యర్ధికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్‌ కోఆర్డినేటర్లకు కాళ్లూ చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.

అదే మీ పనితీరుకు గీటురాయి:
     మీకున్న 7 సెగ్మెంట్లలో ఎంతమందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మీకు మంచి పదవులు వస్తాయి. మీకున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో బాధ్యత తీసుకోవాలి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి.
    అలాగే రీజినల్‌ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంతమందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనా వాళ్లకు పార్టీలో సముచిత స్ధానం దక్కుతుంది. అలాంటి స్ధానం కల్పించే బాధ్యత నాది.
    ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనే విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్‌ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి, ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్ధితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

చరిత్ర పునరావృతం:
    2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆరోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. అదీ మోసంగా తయారైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజావ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు తన ఓటమిని అడ్డుకోలేకపోయారు. 

వారికి మొట్టికాయలు తప్పవు:
    ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. ఓటు అనే ఆయుధం ప్రజల చేతుల్లో ఉంది. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మెట్టికాయలు వేస్తారు. చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు వరకు మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. ఇప్పుడు ఆ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేశాడు. అది ఒకటైతే.. చంద్రబాబు చెప్పింది చేయకపోవడం రెండో అంశం.  అందుకే ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 

వ్యవస్థలన్నీ నిర్వీర్యం:
    మరోవైపు విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్ని పూర్తిగా నీరుగారి పోయాయి. రైతులకు ఏ పంటలకూ గిట్టుబాటు ధర రాని పరిస్ధితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుభరోసా కనిపించడం లేదు. ప్రతి పథకం కనపడకుండా పోతోంది.  
మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్ధాయిలో భయం లేకుండా జరుగుతున్న అవినీతిని గతంలో ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో తెలియదు కానీ.. ఈ ప్రభుత్వంలో రూపాయికే లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1500 కోట్ల నుంచి రూ.1600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఆ స్ధాయిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది.

నిస్సిగ్గుగా ఒప్పందాలు. దోపిడి:
    రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటిపూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్‌ విద్యుత్‌ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్‌–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. 
    అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్‌ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారు అంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.

ఇలాంటి సమయాల్లో క్రియాశీలక పాత్ర:
    ఇలాంటి సమయాల్లో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. వారానికి మూడు రోజులు మీరు కచ్చితంగా మీ మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. మీకు కేటాయించిన జిల్లాల్లో మీరు వారానికి మూడు రోజులు ఉంటేనే జిల్లా మీద పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం.
    పార్టీకి మీరు ఉపయోగపడాలి. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. అంతిమంగా ఈ ప్రయోజనం జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లాగా పని చేయాలి. లేకపోతే రాజకీయం చేయలేం. కలియుగం పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియగంలో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో భయపడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. 

కూటమి ప్రభుత్వం. అనైతిక పనులు:
    చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. 
    తాడిపత్రిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైయస్సార్సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు  వచ్చాయి. కానీ అప్పటి వైయస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మనవైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆరోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. 
    ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామస్ధాయిలో కేడర్‌ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్‌ బుక్‌ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామస్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్ధితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్ధితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.

పని చేయండి. మీ బాధ్యత నాది:
    మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్ధానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. అయితే మీ దగ్గర నుంచి నేను అదే రకమైన కమిట్‌మెంట్‌ ఆశిస్తున్నాను. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయడంపై చాలా సీరియస్‌గా దృష్టి పెట్టాం. చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. బూత్‌  కమిటీల దగ్గర నుంచి గ్రామస్ధాయిలో ఎన్‌రోల్‌మెంట్‌ చేయాలి. వైయస్సార్సీపీ స్థాపించి 15 ఏళ్లు అయింది. వైయస్సార్సీపీ ప్రతి గ్రామంలో బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్‌గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూతు కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి.  

చంద్రబాబుకు అవేవీ లేవు:
    అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. అది కావాలంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్‌గా జరగాలి. వాస్తవంగా గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడు ఏర్పాటు అవుతాయో.. అవి ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. ప్రతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌  ఆ దిశగా పని చేయాలి. అప్పుడే ప్రజలతో మమేకం అవుతాడు.  అందుకే మనం అధికారంలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేను గడపగడపకూ తిరిగే కార్యక్రమం చేయించాం.
    మనం అధికారంలోకి వచ్చేనాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్‌ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయం పడ్డాం. ప్రజలు కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. 

మోసం మనకు చేతకాదు:
    ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్లకు ఏదైనా చేసిన తర్వాతనే మిగిలినవి అన్న ఆలోచనకు నేను వస్తున్నాను. అలా రాక తప్పుదు. చంద్రబాబు హయాంలో ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మనం కూడా మన ప్రయారీటీస్‌కు అనుగుణంగా కచ్చితంగా పని చేయాలి. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్దాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా నేను చెప్పిందే చేస్తాను. చేయలేనిది చెప్పను. ఎప్పుడైనా చెప్పినవి మాత్రం నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. జగన్‌ 2.0లో ఈ మాదిరిగా ఉండదు. వేరే రకంగా ఉంటుంది అని స్పష్టంగా చెబుతున్నాను.
    మనల్ని అభిమానించే వారని కొడుతున్నారు. వాళ్లు దెబ్బలు తింటున్నారు. వారిని ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయి. అది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే వచ్చే దఫా ఇలా ఉండదు. మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
    కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్‌ ధైర్యంగా నిలబడింది. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్రమైన అగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తున్నారు. 

త్వరితగతిన కమిటీల నిర్మాణం:
    బూత్‌ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్‌ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే నెలాఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. 
    జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామస్దాయి విలేజ్‌ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్‌ ప్రెసిడెంట్‌ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్‌ ఉన్నా కూడా డివిజన్‌ ప్రెసిడెంట్‌ను నియమించాలి.
    ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నాటికి బూతు కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది యాక్టివ్‌ సభ్యులకు ప్రత్యేకమైన ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్‌ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం.  అక్టోబరు తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్ధాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గస్ధాయి కమిటీల హెడ్‌లను నియమించాం. మండల స్ధాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియాకమాలు పూర్తవుతాయి.
    వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

మన హయాంలో రైతులకు అండగా..:
    వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టే వాళ్లం. రూ.7,600 కోట్లు ఖర్చు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీ æపడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. అలాగే ఆయిల్‌పాం రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్‌ ఛార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్‌ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్‌ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకునే వాళ్ళం. 

రైతును పట్టించుకోని కూటమి ప్రభుత్వం:
    రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజల సమస్యల్లో వస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలని శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులకు నిర్దేశించారు. 

Back to Top