ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య

పార్టీ ముఖ్య నాయకుల స‌మావేశంలో వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి: పాక్‌ ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట నిర్వహించిన దాడులపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్యగా ఆయ‌న అభివ‌ర్ణించారు.  బుధ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో  వైయ‌స్ జ‌గ‌న్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు పార్టీ ముఖ్యనేతల స‌మావేశంలో ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావించారు. 

ఈ సంద‌ర్భంగా వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:
    ‘భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉన్న బైసరన్‌ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది` అని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

 

మేమంతా అండగా నిలుస్తాం

ఆపరేషన్‌ సిందూర్‌పై వైయ‌స్‌ జగన్  హర్షం

తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు ఆపరేషన్‌ సిందూర్‌పై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. 

ఆపరేషన్‌ సిందూర్‌పై వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు.

Back to Top