కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో వాహనాన్ని అడ్డగించి ప్రత్యర్థులు నారాయణరెడ్డి, సాంబశివుడిని ననరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 19 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. ఇద్దరిని కేసు నుంచి తొలగించారు. ఇక, 11 మంది నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా విధించింది కోర్టు.. రామాంజనేయులు, రామానాయుడు, రామకృష్ణ, బాలు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, వెంకట్రాముడు, గంటల శ్రీను, నారాయణ, బీసన్న గారి రామాంజనేయులు, పెద్ద బీసన్న కు జీవిత ఖైదు శిక్షపడిన వారిలో ఉన్నారు. ఈ కేసులో 29 మంది సాక్షులను విచారించింది కోర్టు.. అందులో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, దేవనకొండకు చెందిన కప్పట్రాళ్ల బుజ్జమ్మ పేర్లను గతంలోనే.. న్యాయస్థానం ఆదేశాల మేరకు తొలగించారు. న్యాయమే గెలిచింది: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు జంట హత్య కేసులో కోర్టు తీర్పును మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వాగతించారు. జంట హత్య కేసులో తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. మొదటి నుండి తాము ఫ్యాక్షన్ ను ప్రోత్సాహించ లేదని, అభివృద్ధి పై దృష్టి సాధించామన్నారు. అమాయకుల జీవితాలతో టిడిపి పార్టీ నేతలు చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సిఎం పదవి అడ్డుపెట్టుకుని ఆనాడు తన భర్త ను హత్య చేయించాడని, చట్టం తన పని తాను చేసిందని, ఇవాళ కోర్టు లో న్యాయం జరిగిందన్నారు. ఫ్యాక్షన్ పేరుతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ ను వీడి అందరు కలిసి మెలిసి ఉండాలని , ప్రాంతాల అభివృద్దికి పాటుపడాలి తప్ప హత్యా రాజకీయాలు వద్దంటూ శ్రీదేవి హితవు పలికారు.