రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా ?

సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసుల సోదాలను ఖండించిన వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత  వైవీ సుబ్బారెడ్డి  

 

తాడేప‌ల్లి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగార‌ని వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత  వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో అస‌లు ప‌త్రికా స్వేచ్ఛ ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సాక్షాత్తు పత్రిక సంపాదకులను టార్గెట్ చేయడం శోచనీయమ‌ని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అని ధ్వ‌జ‌మెత్తారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసుల సోదాలను వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై కోర్టులను ఆశ్రయిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
‘సాక్షి’పై ఏపీ సర్కార్‌ కక్ష సాధింపు 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు.  సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ రెడ్డికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి
`ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి‌ నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు.

విశాఖలో న‌ల్ల బ్యాడ్జిల‌తో జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న‌

సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ  విశాఖ‌లో జ‌ర్న‌లిస్టులు న‌ల్ల‌బ్యాడ్జిలు ధ‌రించి నిర‌స‌న చేప‌ట్టారు. అనంత‌రం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌ర్న‌లిస్టులు మాట్లాడారు.`కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. సాక్షి పత్రికపై కక్ష సాధింపు చర్యకు దిగడం స‌రైంది కాదు. సాక్షి ఎడిటర్ కు నోటీసులు ఇవ్వకుండా ఆయ‌న ఇంటికి ఏ విధంగా వెళ్తారు. సాక్షి గొంతు నొత్తే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కూటమి ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. పత్రికా స్వేచ్ఛ‌ను హరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికే ధనుంజయ రెడ్డిపై అనేక తప్పుడు కేసులు పెట్టారు. ప్రభుత్వ తప్పుడు కేసులకు భయపడేది లేదు. వాస్తవాలను నిర్భయంగా రాస్తాము. త‌ప్పుడు కేసులతో సాక్షి గొంతు నొక్కలేరు` అని జర్నలిస్టు యూనియన్ నేతలు హెచ్చ‌రించారు. 

Back to Top