ప్రజలకు పవన్, చంద్ర‌బాబు క్షమాప‌ణలు చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి డిమాండ్.

30వేల మంది మహిళల అక్రమ రవాణా అంటూ గతంలో పవన్ ఆరోపణలు.

అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన పవన్ కళ్యాణ్, కూటమి నేతల విషప్రచారం.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మహిళ అక్రమ రవాణా అంటూ విషప్రచారం.

కేవలం 34 కేసులు మాత్రమే నమోదైతే 30 వేలంటూ అబద్దాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందంటూ ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్న విషయం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని వైయ‌స్ఆర్‌సీపీ  మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వుమెన్ ట్రాఫికింగ్ కు సంబందించి 34 కేసులు నమోదైన విషయం కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తేల్చిన లెక్కలే  టీడీపీ, జనసేన నేతల విషప్రచారాన్ని బయటపెట్టాయన్నారు. వాలంటీర్లపై అడ్డగోలు అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్, కూటమి నేతలు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి అదృశ్యమైన వారిలో 99శాతం మంది ట్రేస్ అవుట్ అయ్యారని కేంద్ర హోంశాఖ వెల్లడించినా టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. విశాఖపట్నంలో  ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగంఅధ్యక్షురాలు వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

మరోవైపు వైయస్.విజయమ్మ, షర్మిల, సునీతలపై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తప్పుడు పోస్టులు పెట్టించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే,పదే అబద్దాలను పునరావృతం చేయడంపై కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అబద్దాలును అదేపనిగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి వైయస్.విజయమ్మ, షర్మిల, సునీతలపై  సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ సానుభూతిపరుడిని అరెస్టు చేసిన వార్త టీడీపీ అనుకూల మీడియాతో సహా అన్ని పత్రికల్లో వచ్చినా అడ్డగోలుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ అబద్దాలు చెప్పడాన్ని ఖండించారు. రెండేళ్ల క్రితం వైయస్.విజయమ్మ కారు ప్రమాదంపై టీడీపీ అధికార ఖాతాల్లో తప్పుడు పోస్టులు పెడితే.. వాటిని సాక్షాత్తూ విజయమ్మ ఖండించినా మీ ధోరణి మారలేదని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం, వాటిని అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో తప్పుడు వార్తలు రాయడం పరిపాటిగా మారిందన్నారు. 
ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేక వారి దృష్టి మరల్చడానికే ఈ తరహా తప్పుడు ప్రచారం చేస్తూ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.
దిశ చట్టం దౌర్భగ్యమైనది అసెంబ్లీ వేదికపై టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యలపై కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ ను, దిశ పోలీస్ స్టేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన 15 నిమిషాల్లో ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలకు నేనున్నాంటూ పోలీసులు సాయం చేసే పరిస్థితి నుంచి నేడు వారికి రక్షణ లేని దుస్ధితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
అలాంటి దిశ యాప్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అవినీతి మరకలంటించే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మహిళలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా వారి రక్షణను గాలికొదిలేసిందని ఆక్షేపించారు. ఇప్పటికైనా మహిళల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడే దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆక్షేపించారు.

Back to Top