దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి

గతంలో మూడు కమిషన్లు ఇదే స్పష్టం చేశాయి

కేంద్రం సామాజిక న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్

దళిత క్రై స్తవుల‌కు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిషన్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన  
వైయస్‌ఆర్‌సీపీ ప్రతినిధి బృందం. అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన 
వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు డాక్టర్‌ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు తదితరులు

దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే 

మతం మారినా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం పోదని మూడు కమిషన్ల స్పష్టీకరణ 

సిక్కులు, బౌద్ధులకు ఇచ్చినట్లే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి 

2023లో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు అసెంబ్లీలో తీర్మానం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ 

దళితుల రాజ్యాంగ హక్కులను కాలరాసే కుట్ర

కూట‌మి పార్టీల తీరును ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 

దళిత క్రైస్తవుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది

బాలకృష్ణన్ కమిషన్ సానుకూల నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి 

దళితుల హక్కుల కోసం అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం

స్ప‌ష్టం చేసిన వైయస్‌ఆర్‌సీపీ ప్ర‌తినిధి బృందం 

న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేర‌కు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్‌ కే.జి. బాలకృష్ణన్‌ కమిషన్‌కు శ‌నివారం వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం సమర్పించిన అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు, ఎంపీలు డాక్టర్‌ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున‌, ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడారు. దళిత క్రైస్తవుల విషయంలో వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సిక్కులు, బౌద్ధులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూడా అదే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్‌ మిశ్రా తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు.
ప్రెస్‌మీట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ప్ర‌తినిధులు ఏమ‌న్నారంటే..వారి మాట‌ల్లోనే

- దళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి  
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం. ప్రస్తుతం సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. గతంలో నియమించిన పలు కమిషన్లు మతం మారినంత మాత్రాన సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కమిషన్‌ను కోరాం. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిజమైన అర్హుల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ చిత్తశుద్ధితో వ్యవహరించింది. 2023 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానానికి, దళితుల హక్కుల పరిరక్షణకు మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. 

- దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే: గొల్ల బాబూరావు , రాజ్య‌స‌భ స‌భ్యుడు
దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక వాస్తవికత మారదు. మతం ఆధారంగా దళితుల హక్కులను నిరాకరించడం సరికాదు. అందువల్ల దళితులు ఏ మతంలో ఉన్నా వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

- మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు: జూపూడి ప్రభాకర్‌రావు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
దళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తూ వారిని బీసీసీ వర్గంలోకి నెట్టివేసే ప్రయత్నాలను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత క్రైస్తవులు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక వాస్తవికత మారదు. అందువల్ల వారిని ఎస్సీలుగానే పరిగణించాలన్నదే మా పార్టీ స్పష్టమైన వైఖరి. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించింది. ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. మతం మారినా కుల వివక్ష పోవడం లేదని కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రెండు గ్లాసుల విధానం, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అలాంటప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అదే వైఖరికి వైయ‌స్ఆర్‌సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుంది. బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేయాలి. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా మేము ప్రతిఘటిస్తాం. అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. 

 - దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం: మాజీ మంత్రి మేరుగు నాగార్జున 
దళిత క్రైస్తవులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే వైయ‌స్ఆర్‌సీపీ ఈ రోజు పోరాటం చేస్తోంది. దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని స్పష్టంగా సూచించాయి. సిక్కులు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజల్లో ఆందోళన ఉంది. చర్చిలపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దళిత సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడిగా వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 24న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి వైయ‌స్ఆర్‌సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయానికి అనుగుణమైన చర్య అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దళితులు, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది. దళిత క్రైస్తవుల పక్షాన వైయస్ జగన్ గారు దృఢంగా నిలబడతారని స్పష్టం చేస్తున్నాం.

- దళితుల పక్షాన నిలిచిన నాయకుడు వైయ‌స్ జగన్: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్  
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో దళితుల హక్కులపై కుట్ర జరుగుతోందనే ఆందోళన కలుగుతోంది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టుకతో వచ్చిన కులాన్ని మత మార్పిడితో మార్చలేమనే వాస్తవాన్ని గుర్తించాలి. మతం మారినా సామాజిక వివక్ష, వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి.  సిక్కు, బౌద్ధ మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతుంటే, దళిత క్రైస్తవుల విషయంలో మాత్రమే భిన్నమైన వైఖరి అవలంబించడం సమంజసం కాదు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని గతంలో నియమించిన కమిషన్లు సిఫార్సు చేశాయి. అయినప్పటికీ మరోసారి ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు మారిపోలేదు. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష, వెలివేత, అనేక రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను కాలరాయడం సరికాదు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతోంది. 2023లో వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది.  దళితులకు అన్యాయం జరిగితే వైయ‌స్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉంటుంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం సాధిస్తాం. దళితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ, వైయస్ జగన్ గారు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు.  

- ఎస్సీ హోదా లేదనడం వివక్షతకు నిదర్శనం: వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ 
దళితులు ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతంలోనే ఉండాలని, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదని చెబుతున్నారు. అయితే బౌద్ధం, సిక్కు మతాలను స్వీకరించిన దళితులకు మాత్రం ఎస్సీ హోదా కొనసాగిస్తున్నారు. ఈ భిన్నమైన వైఖరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవుల విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన కమిషన్ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైస్తవ మతంలో కులం లేదని, అంటరానితనం లేదని చెప్పడం ద్వారా భారతీయ సామాజిక వాస్తవాలను విస్మరిస్తున్నారు. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష, వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోవడం లేదనేది వాస్తవం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకుంది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. 
 
- ఎస్సీ హోదా కోసం ఐక్య పోరాటం:  మాజీ ఎంపీ నందిగామ సురేష్ 
మతం మారిన కారణంతో దళితులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక పరిస్థితులు, వివక్షకు గురయ్యే వాస్తవాలు మారవు. అందువల్ల దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాల్సిందే. దళితుల హక్కుల అంశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు ఈ విషయంపై కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పదవుల కోసం మౌనం పాటించకుండా దళిత సమాజం తరఫున గొంతెత్తాలి. దళితుల సమస్యలు, హక్కుల అంశాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవడం సరైంది కాదు.  దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు ప్రశ్నించాలి. సమాజంలో సంపద, అవకాశాలు, హక్కులు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు పనిచేయాలి. దళితులకు న్యాయం జరిగే వరకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించే వరకు అందరం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాం.   

Back to Top