యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం

పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌ అడిగినందుకు అక్రమ అరెస్ట్

13 నెలలుగా యువ వైద్యుల భవిష్యత్‌తో చెలగాటం

వైయస్ఆర్‌సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర

తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్యవృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు.

ఇంకా వారేమన్నారంటే...

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్‌ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు దోరణితో మాట్లాడారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్‌పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్‌ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్‌షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు. కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది.  దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్ కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం

Back to Top