తాడేపల్లి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పోటీగా చంద్రబాబుకు భజన చేయాలనే తపనతో రామోజీ కుమారుడు చెరుకూరి కిరణ్ తన పత్రిక ఈనాడుతో కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడయా ద్వారా నిత్యం చంద్రబాబును జాకీలు పెట్టి పైకి అతిగొప్ప పాలకుడుగా చూపడానికి ఎంత స్థాయికైనా దిగజారిపోతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలను అడ్డం పెట్టుకుని వారు రాస్తున్న నీచమైన రాతలు, భజన గీతాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. పచ్చపైత్యంను తలకెత్తించుకున్న జర్నలిస్ట్‌లు పచ్చమూకగా మారి చంద్రబాబు సేవలో తరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఈనాడు ఈ రోజు తన పత్రిక పతాక శీర్షికలో 'తెలుసా కార్యకర్తల మనస్సు' అనే కథనాన్ని ప్రచురించింది. దీనిలో నియోజకవర్గ స్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు, లేకపోతే అధికారంకు దూరమవుతారంటూ చంద్రబాబు పట్ల చెరుకూరి కిరణ్ తన ప్రభుభక్తిని చాటుకున్నారు. అరాచక ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయకపోతే కష్టమంటూ సలహాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎలా మనుగడ సాగించాలి, ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలోనే ఉండాలంటే ఏం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఈనాడు పత్రిక పనిచేస్తోందనేందుకు ఇది ఒక నిదర్శనం కాదా? ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నారు? ప్రజల కోసం పనిచేసేలా ప్రభుత్వంపై కనువిప్పు కథనాలను రాయడం అనేది పత్రికలు చేసే పని. కానీ ఈనాడు మాత్రం ప్రజలు ఎటు పోయినా ఫరవాలేదు, చంద్రబాబు మాత్రం ఎప్పుడూ అధికారంలో ఉండి, తమ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలనే ధ్యేయంతో ఉంది. దీనికి అనుగుణంగానే తన పత్రికలో ప్రత్యేక కథనాలు రాస్తోంది. చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ గురించి గతంలో ఏం చెప్పారో చూస్తే 'మేం చెప్పింది అధికారులు చేయాలి, అధికారులు సొంతగా నిర్ణయాలు చేయడం కాదు, కేవలం తెలుగుదేశం వారికే పనులు చేయాలి, తప్పు లేకపోయినా వైయస్ఆర్‌సీపీ వారిపై కేసులు పెట్టాలి, వారిని జైలుకు పంపాలి. వైయస్ఆర్‌సీపీ వారికి ఎటువంటి పనులు చేయవద్దు' అంటూ తన అభిప్రాయాలకు వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన ఈ సుభాషితాలను ఇప్పుడు నియోజకవర్గస్థాయిలో అమలు చేయాలని ఘనమైన ఈనాడు సిగ్గులేకుండా తన పత్రికలో ప్రచురించింది. అలాగే ఇదే పత్రిక గత ప్రభుత్వంలో కొనసాగిన అధికారులను, కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగిస్తున్నారంటూ విషం చిమ్మేలా మరో కథనాన్ని ప్రచురించింది. ఎక్కడైనా ప్రభుత్వ అధికారులే ఉంటారు తప్ప, పార్టీకి చెందిన అధికారులు ఉండరు. కానీ అధికారులపైన దురుద్దేశాన్ని ఆపాదిస్తూ ఇంత దారుణమైన కథనాలను రాయడం ఎల్లో మీడియాకే దక్కుతుంది. ప్రభుత్వంపై విమర్శలకు ఉలిక్కిపడుతున్న ఈనాడు-ఆంధ్రజ్యోతి ఏదైనా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే, వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఉలిక్కిపడుతున్నాయి. ఆ విమర్శలకు ప్రభుత్వానికి బదులు ఈ రెండు ఎల్లో పత్రికలు, మీడియాలే సమాధానాలు చెబుతున్నాయి. వాటిపైన కథనాలు రాస్తున్నాయి. ఆ కథనాలపై చర్చలు పెట్టి, ప్రతిపక్షం ప్రశ్నించడమే తప్పు అనే విధంగా విషం చిమ్ముతున్నాయి. మొత్తం ప్రభుత్వ ఎజెండాను ఈ పత్రికలే నిర్ధేశిస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, చానెళ్ళు ఒకరిని మించి మరొకరు చంద్రబాబుకు డప్పు కొట్టడంలో పోటీ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా పచ్చ మాఫియాగా మారిన జర్నలిస్ట్‌లు, ప్రజంటేటర్లుగా వారి టీవీ ఇంటర్వూల్లో అడుగుతున్న ప్రశ్నలు చూస్తుంటే ఇంతకంటే దిక్కుమాలిన జర్నలిజం ఎక్కడైనా ఉంటుందా అనే సందేహం కలుగుతోంది. పరిపాలనలో ఈ ప్రపంచంలోనే చంద్రబాబు అంత గొప్ప నాయకుడు ఎవరూ లేరంటూ ఎల్లో మీడియా చానెల్స్ ఇంటర్వూలో అడిగిన ప్రశ్నలు, ప్రసంశలు, వైయస్ జగన్‌పై విమర్శలు చూస్తుంటే వీరు జర్నలిస్ట్‌లా లేక చంద్రబాబుకు అమ్ముడుపోయిన పచ్చమూకా అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. వైయస్ జగన్ బెయిల్ మీద ఉన్నారు, ఇంకా ఎంత కాలం ఆయన బయట ఉంటారని ఈటీవీ ఇంటర్వూలో జర్నలిస్ట్ చంద్రబాబును ప్రశ్నించారు. అదే జర్నలిస్ట్‌కు చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళి, అనారోగ్యంను సాకుగా చూపి బెయిల్‌పై బయటకు వచ్చారని తెలియదా? ఇప్పుడు బెయిల్ మీద ఉన్న చంద్రబాబు సీఎం స్థానంలో కూర్చున్నంత మాత్రాన ఈ ప్రశ్న చంద్రబాబును ఎందుకు అడగలేక పోయారు? మీ ఆరోగ్యం బాగుంది కదా? ఎప్పుడు జైలకు వెడతారని ఎందుకు ప్రశ్నించలేదు? 21 కేసుల్లో స్టేలు తెచ్చుకుని నిత్యం భయంతో గడుపుతున్నారు కదా? వీటిపై ఎందుకు ధైర్యంగా విచారణకు వెళ్ళలేకపోతున్నారని అడగలేరు? ఎందుకంటే వారు జర్నలిస్ట్ ముసుగు వేసుకున్న పచ్చమూక, చంద్రబాబు తొత్తులు కాబట్టి. పత్రికల పేరుతో ప్రజాసమస్యల గురించి కాకుండా వైయస్ జగన్ గారిని అణగదొక్కాలి, చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపాలన్నదే ఈ పచ్చమూక జర్నలిస్ట్‌ల లక్ష్యం. వైయస్ఆర్‌సీపీ వారిపై నమోదైన కేసుల్లో ఎల్లో మీడియానే విచారణ చేస్తోంది. నేరాన్ని నిర్ధారించి ఏ శిక్షలు కూడా వేయాలో చెప్పేస్తున్నారు.